ఎదులాపురం, ఆగస్టు 13 : సమగ్ర అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ ప్రజల మధ్య మతాలపేరుతో చిచ్చు పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానికులు డప్పుచప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్న అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్పాన్ హైమద్‌తో పాటు 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. మరోవైపు స్థానిక పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేని ఓ కాంగ్రెస్ నాయకుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. బీజేపీలో చేరి కల్లిబొల్లి మాటలు చెప్పిన సదరు నేత టికెట్ రాదని తెలియగానే కాంగ్రెస్‌లో చేరాడని, ఇలాంటి నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజయ్‌కుమార్, అశ్రఫ్, కౌన్సిలర్ అంజుబాయి, నాయకులు సంతోష్, ఇమ్రాన్, సలీం, శివకుమార్, ఆశన్న పాల్గొన్నారు.
అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే
అభివృద్ధిని చేసి చూపిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని దోబీకాలనీలో రూ.16 లక్షలతో నిర్మించిన నవ చైతన్య యూత్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ముందుగా కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక యువకులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సీతారామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అలాగే ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. జై తెలంగాణ ,జై జోగు రామన్న నినాదాలతో నాయకులు, యువకులు హోరెత్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, గతంలో పాలించిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సమగ్ర అభ్యున్నతే పరమావధిగా దూసుకెళ్తున్నారన్నారు. అభివృద్ధి పనులు, ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలు అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సనాతన ధర్మప్రాశస్త్యాన్ని, విశిష్టతను కాపాడడుతూ భావితరానికి తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, కౌన్సిలర్ భరత్, అధికార ప్రతినిధి గంగారెడ్డి, రాజు, చిట్యాల దత్తు, అశోక్‌స్వామి, మెట్టు ప్రహ్లాద్ పాల్గొన్నారు.
ఆర్థిక ప్రగతి సాధించాలి
ఐకమత్యంగా ఉంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మున్నూరుకాపు కులస్తులు నడుపుతున్న వ్యాపారాలు, ఒకరికొకరు సహాయం ఇచ్చిపుచ్చుకుంటే సాధించే విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, ప్రముఖ వైద్యుడు అభిజిత్, సాయినిరవి కుమార్, జక్కుల సత్యనారాయణ, బేర సతీశ్, జక్కుల శ్రీకాంత్, అడప ఓం ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.