హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ (Pending Bills) సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా.. ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బాబు జర గీ ఫైల్ క్లియర్ చేయండి’ అని వేడుకుంటున్నారట! సచివాలయంలో ఎక్కే గడప, దిగే గడప అంటూ ఆయన చేయని ప్రయత్నం లేదు. ‘దళిత, గిరిజనుల పిల్లల చదువు ఆగమైపోతున్నది.. జర చూడండి సా ర్’ అని ఓ సీనియర్ ఐఏఎస్ దగ్గరికి వెళ్తే ‘ఎప్పుడు పడితే అప్పుడేనా? మీకు సమయం సందర్భం లేదా?’ అని కోపగించుకున్నట్టు తెలిసింది. అయినా ఆ మంత్రి పట్టువదలని విక్రమార్కుడిలా ఫైల్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నారని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకూ ఆయన పట్టుకొని తిరుగుతున్నది రూ.200 కోట్ల పెండింగ్ బిల్లుల ఫైల్. గ్రీన్ చానల్ మంత్రులకైతే ఇది క్షణాల పని. సింగిల్ బటన్ క్లిక్‌తో అయిపోయేది.
రెండేండ్లుగా పెండింగ్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఇంగ్లిష్ మీ డియం పాఠశాలల్లో ఏటా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం (Best Available Schools కింద విద్యార్థులను చేర్చుకుంటారు. జిల్లాల వారీగా 1వ తరగతి, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకు నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రెసిడెన్షియల్ సూళ్లలో అవకాశం ఇస్తారు. ప్రతి డే సాలర్కు రూ.28 వేలు, రెసిడెన్షియల్ స్టూడెంట్‌కు రూ.42 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 230 బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలల్లో 29 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకానికి బిల్లులు బకాయిపెట్టింది. రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండేండ్లుగా ఈ సీంకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు పిల్లలను ఇంటికి పంపిస్తున్నాయి. ఓ మంత్రి ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటినుంచి ఈ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఫైల్ పట్టుకొని తిరగుతున్నా ప్రభుత్వ పెద్దలు స్పందించటం లేదని తెలిసింది.