Lok Sabha Elections | హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ వ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, విలువైన ఆభరణాలు, నార్కోటిక్ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీ వరకు అమల్లో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ. 99.16 కోట్ల నగదు, రూ. 11.48 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 14.52 కోట్ల విలువ చేసే నార్కోటిక్ డ్రగ్స్, రూ. 63.19 కోట్ల విలువ చేసే ఆభరణాలు(92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి), రూ. 11.91 కోట్ల విలువ చేసే ఇతర వస్తువులను సీజ్ చేశారు. 2019 ఎన్నికల్లో కేవలం 46.3 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, మద్యం సీజ్ చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య మూడింతలు పెరిగింది.