Siddipet | సిద్దిపేట టౌన్, ఆగస్టు 16 : డబ్బుల కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.20 వేల వడ్డీ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన సొంత అన్నావదినను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని నాసర్పురాలో శుక్రవారం కన్నీరు పెట్టించింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణానికి చెందిన దొంతరబోయిన పరశురాములు తన అవసరాల నిమిత్తం సొంత తమ్ముడు కనకయ్య వద్ద లక్ష రూపాయల అప్పుగా తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.20 వేల వడ్డీ కోసం తమ్ముడు కనకయ్య అన్న పరశురాములను వేధించాడు. ఈ క్రమంలో కౌన్సిలర్ జంగిటి కనకరాజు వద్దకు వీరి పంచాయితీ వెళ్లింది.
ఆయన వీరిద్దరిని పిలిచి మాట్లాడుతుండగానే ఇద్దరు గొడవకు దిగారు. వారిని కౌన్సిలర్ అక్కడి నుంచి పంపించేశారు. అన్న పరశురాములు వెళ్లి పోతుంటే.. ‘నాకు ఇవ్వాల్సి వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఎలా పోతావో? చూస్తా’ అంటూ.. అన్నను లాక్కొచ్చి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని చెట్టుకు కట్టేశాడు. అతంటితో ఆగకుండా అడ్డువచ్చిన వదినను సైతం కట్టేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో కనకయ్యపై కేసు నమోదు చేశారు.