హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 15 కుటుంబాలకు అందజేస్తాం. ఆ తర్వాత ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి, సర్పంచ్, ఎంపీటీసీ, దళితబంధు కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి.. అక్కడే లబ్దిదారులను ఎంపిక చేస్తాం. అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించి, అందరికీ పథకం వర్తింపజేస్తామన్నారు. ఈ నియోజకవర్గంలోని అర్హుడైన ప్రతీ కుటుంబానికి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ పెంచుకుని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.