హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువతను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఐదుగురు యువతలో ఒకరికి ఉద్యోగం లభించడం లేదు. దీంతో నిరుద్యోగ రేటు 20.1 శాతానికి చేరుకున్నది. ఇది జాతీయ సగటు 14.6 శాతం కంటే చాలా అధికం. రాష్ట్ర సమగ్ర నిరుద్యోగ రేటు 6.9 శాతంగా, జాతీయ సగటు మాత్రం 5.4 శాతంగా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విడుదల చేసిన నివేదికలో లింగ, ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా వెల్లడయ్యాయి. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో యువతుల నిరుద్యోగ రేటు 28.6 శాతంగా, యువకుల నిరుద్యోగ రేటు 19.2 శాతంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో 16%, పురుషుల్లో 19.4% నిరుద్యోగ రేటు ఉన్నది. మొత్తంగా యువత నిరుద్యోగ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 18.3 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 22 శాతంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మహిళల్లో 12 శాతంగా, పురుషుల్లో 7 శాతంగా ఉన్నది.
15-29 ఏండ్ల్ల వయసున్న మహిళల్లో 27.2% మంది మాత్రమే కార్మికశక్తిలో భాగంగా ఉన్నారు. ఈ రేటు పురుషుల్లో 60.4 శాతంగా ఉన్నది. రాష్ట్రంలో 15 ఏండ్ల్లు లేదా అంతకంటే ఎకువ వయసున్న మహిళల్లో పీఎల్ఎఫ్ఎస్ 41.6 శాతంగా, పురుషుల్లో 76.1 శాతంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం కార్మికశక్తిలో 32.9% మంది వ్యవసాయ రంగంలో, 29.1% మంది గనులు, నిర్మాణ, తయారీ రంగాల్లో, 38% మంది సేవల రంగంలో ఉన్నారు. తెలంగాణలో సేవల రంగం వృద్ధి చెందినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో యువ గ్రాడ్యుయేట్లకు తగినన్ని ఉద్యోగాలు లేవు. ఈ సమస్య రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా పరిణమిస్తుందని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.