Pani Puri | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో పానీపూరి తిని దాదాపు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ఓ బండి వద్ద పానీపూరి తిన్నారు. వారికి మంగళవారం ఉదయం నుంచి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు వారిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో రిషికేశ్ అనే బాలుడికి తీవ్ర జ్వరంతో ఫిట్స్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మరో 8 మంది చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
అయితే పానీపూరీ తినడం వల్లే వాళ్లందరూ అస్వస్థతకు గురయ్యారా? ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందరికీ ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తుండటంతో ఫుడ్ పాయిజన్ వల్లే చిన్నారులు అస్వస్థతకు గురై ఉంటారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో పానీపూరీ బండి నుంచి సేకరించిన ఆహార పదార్థాలను టెస్టింగ్కు పంపించారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత రానుంది.