హైదరాబాద్: నగరంలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలుచోట్ల పటాకులు (Crackers) కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో బాధితులు మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖానకు క్యూకట్టారు. ఇప్పటివరకు 27 కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నామని వెల్లడించారు. వారిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. పటాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
మరోవైపు.. పాతబస్తీలోని ఛత్రినాక పరిధిలో ఉన్న కందికల్ గేటు దగ్గర పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కందికల్లోని పీవోపీతో బొమ్మలు తయారుచేసే పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలిచారు. పటాకులకు రసాయనాలు తోడవడంతో పేలుడు తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.