హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఖజానాకు మరో రూ.2,000 కోట్లు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా ఈ నిధులను సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. రూ.1,000 కోట్ల విలువైన బాండ్లను ఎనిమిదేండ్ల కాలానికి, మరో రూ.1,000 కోట్ల విలువైన బాండ్లను తొమ్మిదేండ్ల కాలానికి జారీచేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ మంగళవారం వేలం వేసింది. చివరిసారి ఆగస్టు 23న బాండ్ల విక్రయాల ద్వారా రూ.1,000 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకున్నది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనే రుణాల మొత్తం రూ.18,500 కోట్లు అ వుతుంది. వీటిని మూలధనం కింద ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 53,970 కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. తొలుత.. బడ్జెట్, అప్పులు తదితర సాకులను చూపుతూ రెండు నెలలపాటు రుణాలు తీసుకోకుండా కేంద్రం అడ్డుకున్నది. కేంద్ర తీరును సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. జాతీయస్థాయిలో ఎండగట్టారు. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు. రుణాలివ్వాల్సిందేనని కోరారు. కేంద్రం ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ.. రాష్ట్ర ఆర్థికశాఖ సుదీర్ఘ లేఖ రాసింది. కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. అప్పటికే కేంద్రం తీరుతో సుమారు రూ.8 వేల కోట్లు తెలంగాణ నష్టపోవాల్సి వచ్చింది.