హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఆగస్టులో దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టే.. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రంలోని రైతులందరూ రుణ విముక్తులై స్వేచ్ఛను పొందుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్ట్ దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలని అభివర్ణించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుంచి రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదలచేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6,198 కోట్లు జమ చేస్తున్నట్టు చెప్పారు. రుణవిముక్తి పొందిన లక్షలాది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటుంటే తన జన్మ ధన్యమైందని అన్నారు. జూలై 18న తొలి విడతగా 11 లక్షల మంది రైతులకు రూ.6,098 కోట్లు మాఫీ చేశామని, మళ్లీ 12 రోజుల వ్యవధిలోనే రెండో విడత కింద రూ.6,198 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
మొత్తంగా 12 రోజుల్లోనే రూ.12 వేల కోట్ల రుణం మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారతోపాటు ఆర్థిక శాఖ అధికారుల బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రైతు రుణమాఫీకి ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోనే రూ.లక్షన్నరలోపు రుణాలను మాఫీ చేశామని, అగస్టులో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ రోజు పండుగ దినం అని, రైతుల గుండెలపై ఉన్న పెద్ద భారం తొలగిపోతుందని పేర్కొన్నారు. ఆగస్టు చివరకల్లా రూ.రెండు లక్షల రుణమాఫీ అమలు చేయబోతున్నామని స్పష్టంచేశారు.
త్వరలో పంటల బీమా పథకాన్ని అమలుచేస్తామని వెల్లడించారు. రుణమాఫీ రెండు దశల్లో కలిపి 17.91 ఖాతాలకు, 16.29 లక్షల కుటుంబాలకు రూ.12,289 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. రైతుబీమా కింద 42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,580 కోట్ల ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. బ్యాంకర్లు విశాల హృదయంతో రైతులకు సహకరించి వెంటనే రుణాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మాఫీ కోసం తిరిగి తిరిగి సస్తున్నం
మేము పెద్దవంగర బ్యాంకులో రూ.30వేలు పంటరుణం తీసుకున్నం. ఇప్పటివరకు మాఫీ కాలే. బ్యాంక్ పెద్దసారు వ్యవసాయ అధికారులను కలువమని చెప్పిండు. వాళ్లు ఎక్కడ ఉంట రో తెల్వక తిరిగి తిరిగి సస్తున్నం. మా ఆయన తాటి చెట్టు పైనుంచి పడి నడవలేని స్థితిలోఉన్నడు.పెద్దవంగరలోని రైతు వేదిక వద్దకు పొమ్మని కొందరు చెప్పిండ్రు. అది చాలా దూరం. అక్కడికి ఆటోలు పోవు. ముసలోళ్లం నడవలేక ఇంటికే పోతున్నం. అధికారులు మాలాంటోళ్ల ను చూసి ఆదుకోవాలి.
– బొమ్మెర రాములు, వెంకటమ్మ చిన్నవంగర, మహబూబాబాద్ జిల్లా
1.20 లక్షల రుణం మాఫీ కాలె..
నాకు ఎకరం పొలం ఉన్నది. మాచిరెడ్డిపల్లి సొసైటీలో రూ.1.20 లక్షలు అప్పు ఉన్నది. అందరి మాదిరిగానే నాకు కూ డా రుణమాఫీ అవుతుందని ఆశగా ఎదురు చూసిన. సొసైటీకి వెళ్లి చూసే సరికి రుణమాఫీ లిస్టులో నా పేరు లేదు. ఇప్పుడు నేనేమి చేయాలో అర్థం కావడం లేదు.
-నాంచారి దేవయ్య, మాచిరెడ్డిపల్లి, మం: కోహీర్, జిల్లా సంగారెడ్డి
ఐటీ లేదు.. మాఫీ లేదు
నేను పెద్దపల్లి ఇండియన్ బ్యాంకుల రూ.1.20 లక్షల క్రాప్‌లోన్ తీసుకున్న. ఈ ఏడా ది ఫిబ్రవరిల వడ్డీ కట్టి రెన్యువల్ చేయించిన. రెండో విడత లిస్టుల నా పేరు లేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే సరైన సమాధానం లేదు. నాకు తెల్లరేషన్ కార్డు ఉంది. ఐటీ లేదు. మరి ఎందుకు మాఫీ కాలేదో తెలుస్తలేదు.
-కే సారయ్య, రైతు, రంగంపల్లి, పెద్దపల్లి జిల్లా
మూడో విడతలో అయితదని చెప్తుండ్రు
నేను యూనియన్ బ్యాంకు నుంచి రూ. 1,36,000 పం ట రుణం తీసుకున్న. రెండో విడత లిస్టుల పేరు రాలేదు. అకౌంట్ హోల్డ్‌లో ఉందని బ్యాంకు మేనేజర్ చెప్పిండు. వ్యవసాయ అధికారులను అడుగమన్నడు. చందుపట్ల రైతు వేదికలో ఏఈవోను అడిగితే ఆధార్ నంబర్ కొట్టి పంపుతున్నా. మూడో విడతలో వస్తదిపో అన్నడు. ఎందుకు ఆగిందో తెల్వట్లేదు. – చెట్టుపల్లి రమేశ్,గోరెంకలపల్లి, నకిరేకల్ మండలం
లిస్టుల పేరు లేదట
నాకు ఐదు ఎకరాలున్నది. కెనరా బ్యాంకుల లక్ష పది వేల లోన్ తీసుకున్న. రేవంత్ సర్కారు ఇయ్యాళ లచ్చన్నర దాకా లోన్లు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఏమైందని అడిగితే లిస్టుల పేరు లేదంటుండ్రు. ఏం జెయ్యాల్నో అర్థమైతలేదు.
– లక్ష్మీబాయి, రెంజల్, జిల్లా నిజామాబాద్