ADE Ambedkar | హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే అంబేద్కర్ నివాసంతో పాటు బంధువుల ఇంట్లో లెక్కలేనంతా డబ్బు బయటపడుతుంది. ఆస్తులు కూడా భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ. 2 కోట్ల నగదు పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. భారీగా బంగారం కూడా పట్టుబడింది. ఈ బంగారం విలువను కూడా అధికారులు లెక్కిస్తున్నారు.
రూ. 2 కోట్ల నగదును చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయారు. అన్ని రూ. 500 నోట్ల కట్టలే ఉన్నాయి. రూ. 200 నోట్ల కట్టలు ఒకట్రెండు ఉన్నాయి. ఈ నగదును లెక్కపెట్టేందుకు నోట్ల లెక్కింపు యంత్రాల సహాయం తీసుకున్నారు అధికారులు. సాయంత్రంలోగా మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి , మాదాపూర్ , హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపట్టారు.
ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.