మహబూబ్‌నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానదీ జలాలను తెలంగాణకు రాకుండా కర్ణాటక అడుగడుగునా కుట్ర పన్నుతున్నది. మన రాష్ట్రంలోకి కృష్ణవేణి ప్రవేశించే చోటే రాత్రింబవళ్లు విరామం లేకుండా అక్రమంగా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు ఊపందుకొన్నాయి. ఇప్పటికే 90 శాతం పంపుహౌస్ పనులు పూర్తికాగా, ఈ అక్రమ కట్టడంపై పాలమూరు ‘హస్తం’ నేతలు కనీసం నోరెత్తడం లేదు. ఈ నేపథ్యంలో కర్ణాటక జలదోపిడీ గుట్టు విప్పేందుకు ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం’ ప్రాజెక్టును సందర్శించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కన్నడ సర్కారు రూ.189 కోట్లతో పైపులైన్లు వేసి సాగునీటిని తరలించేలా పనులను ‘కృష్ణ భాగ్య జల నిగం లిమిటెడ్’కు అప్పగించింది. రాయచూర్ జిల్లాలోని గంజినహళ్లి గ్రామం వద్ద ఈభారీ పైపులైన్ నిర్మాణం చేపడుతున్నారు. తాగునీటి అవసరాలకు అని చెప్తున్నప్పటికీ భారీ పైపులైన్లు వేసి 18 గ్రామాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టినట్టు తెలుస్తున్నది. తాగునీటి అవసరాలకైతే 1,790 హార్స్పవర్ మోటార్లు ఎందుకు ఉపయోగిస్తారని మన రైతులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ పథకంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావంపడే అవకాశం ఉన్నదని మన ఇంజినీర్లు పేర్కొంటున్నారు. జూరాలకు నీటి రాక తగ్గే పరిస్థితి కనిపిస్తున్నదని, వేసవిలో నీటి ఎద్దడి తీవ్రతరమయ్యే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. గత బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కాంగ్రెస్ నాయకులు మౌనం వహించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదనే అనుమానం వ్యక్తమవుతున్నది.
పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చిట్టెం
కర్ణాటక సర్కారు అక్రమంగా కృష్ణానీటిని తరలించేందుకు నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులను మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శనివారం నది వద్దకు వెళ్లి పరిశీలించారు. కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి సమీపంలోని నదీ తీరం వెంట ఎమ్మెల్యే పర్యటించారు. ఆయన మాట్లాడుతూ సాగునీరు తరలించేందుకు కన్నడ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు కర్ణాటక ఉన్నతాధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తరహాలోనే..
ఈ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు డైవర్షన్ స్కీంను పోలి ఉన్నది. అక్కడ నీటిని గ్రావిటీ సాయంతో తరలిస్తే.. ఇక్కడ ఏకంగా నదిని అనుసరించి భారీ పంపుహౌస్‌ను నిర్మిస్తున్నారు. దాదాపు 30 మీటర్ల లోతున ఇంటేక్వెల్ను నిర్మించి అక్కడి నీటిని కాలువ ద్వారా తరలించేలా కన్నడ ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఈ పంపుహౌస్‌కు కనెక్టివిటీ ఇస్తూ కృష్ణానదిలోకే పెద్ద కాలువను తవ్వారు. నది నుంచి ఈ కాలువ ద్వారా వచ్చే నీటిని వచ్చినట్టుగానే డైవర్ట్ చేసి నేరుగా పంపుహౌస్‌లోకి వెళ్లేలా డిజైన్ చేశారు. పంపుహౌస్‌లో ఏర్పాటవుతున్న నాలుగు భారీ పంపులతో నీటిని నిరంతరాయంగా ఎత్తిపోసేలా ప్లాన్ రూపొందించారు. 1,790 హార్స్ పవర్గల నాలుగు పంపులను ఇక్కడ బిగిస్తున్నారు. ఈ పంపులతో నిరంతరాయంగా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఇవి తాగునీటి అవసరాల కోసమేనని బుకాయిస్తున్నది. మంచినీటిని తరలించే స్కీం అని చెప్తున్నా ఇంత భారీ పరిమాణంలో పంపుహౌస్ నిర్మించాల్సిన అవసరం ఏముందని తెలంగాణ రైతాంగం ప్రశ్నిస్తున్నది.
రూ.189 కోట్లతో భారీ ఎత్తిపోతల పథకం..
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి వచ్చే నీటిని జూరాలకు చేరకుండా ముడుమాల ఎత్తిపోతల పథకం ద్వారా నీటి అక్రమ తోడివేతకు ప్లాన్ చేసింది. ఏడాది పొడవునా నదిలో పారే చుక్క నీటిని కూడ వృథా చేయొద్దనేది వారి ఉద్దేశంగా నిర్మాణం చూస్తే అర్థమవుతున్నది. కృష్ణా జలాలను ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక, దిగువన ఏపీలు కేటాయించిన నికరజలాల కన్నా ఎక్కువగా వాడుకుంటున్నాయి. వరద జలాలను ఎక్కడికక్కడే ఒడిసి పట్టేలా కర్ణాటక, మహారాష్ట్ర బ్రిడ్జి కం బరాజ్ పేరుతో నది నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయి. దీంతో పదేళ్ల క్రితం నిండుగా కనిపించిన కృష్ణా నదిలో నీటి జాడ కనుమరుగవుతున్నది. ఎగువన ఉన్న రాష్ర్టాలు బ్రిడ్జి కం బరాజులు, ఎత్తిపోతలు నిర్మిస్తుండడంతో ప్రవాహం తగ్గిపోయిందని నీటి పారుదల నిపుణులు చెప్తున్నారు. వర్షాకాలంలో ఎగువన కురిసిన వానలకు నది ఉప్పొంగినా కొద్ది రోజులకే ప్రవాహం తగ్గుముఖం పట్టి ప్రాజెక్టుల్లో నీళ్లు రావడం గగనమైపోయింది.