Junior Colleges | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదే 183 జూనియర్ కాలేజీలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు (గురుకులాలు, కేజీబీవీ) క్లోజ్ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ 28, మైనార్టీ 16, గిరిజన 14, ఎస్సీ గురుకులాలు 4 ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే 77 ప్రైవేట్ జూనియర్ కాలేజీల కథ కూడా పరిసమాప్తంకానున్నది. ఇప్పటి వరకు ఈ కాలేజీలు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయనిదే అనుబంధ గుర్తింపు దక్కదు. ఈ లెక్కన 183 కాలేజీల ముచ్చట ఒడిసినట్టే. ఏటా ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం అన్ని రకాల కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు తనిఖీలు చేసి గుర్తింపు ఇస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,064 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేశాయి.
183 కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు సమర్పించలేదు. వీటిలో అత్యధికంగా 101 ప్రభుత్వ, గురుకుల జూనియర్ కాలేజీలే ఉన్నాయి. మూడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా దరఖాస్తు చేయలేదు. ఒక కో ఆపరేటివ్, ఒక ఇన్సెంటివ్, రెండు ఎయిడెడ్, ఒక రైల్వే/సెంట్రల్‌గవర్నమెంట్ కాలేజీలు, 2 మాడల్ స్కూల్స్, 34 కేజీబీవీలు కూడా దరఖాస్తులు సమర్పించలేదు. దరఖాస్తు చేసుకున్న 700 పైచిలుకు కాలేజీలకు ఇప్పటికే ఇంటర్‌బోర్డు గుర్తింపు ఇచ్చింది. జూన్ 2 నుంచి కాలేజీలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 101 కాలేజీలు క్లోజ్ అయినట్టేనా? అన్న అనుమానాలొస్తున్నాయి. ఆలస్య రుసుము లేకుండా అఫిలియేషన్ దరఖాస్తుల గడువు ఈ నెల 4తో ముగిసింది. ప్రస్తుతం ఆలస్య రుసుముతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసే అవకాశముంది. అంతలోపు దరఖాస్తు చేస్తారా..? అంటే అనుమానంగానే కనిపిస్తున్నది.
రేవంత్ సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సైతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ రెండేండ్ల కాలంలో 150 వరకు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మూసివేతకు సిద్ధమయ్యాయి. ఈ ఒక్క ఏడాదే 77 కాలేజీలు క్లోజ్ కానున్నాయి. 2024-25లో 1,415 ప్రైవేట్ కాలేజీలు గుర్తింపు పొందగా, ఈ ఏడాది 1,338 కాలేజీలే దరఖాస్తు సమర్పించాయి. 2023-24లో 1,482 ఉండగా, 2024-25కు వచ్చేసరికి వీటి సంఖ్య 1,415కు పడిపోయాయి. నిరుడు ఒక్క ఏడాదిలోనే 67 కాలేజీలు మూతపడ్డాయి. ఈ ఏడాది 77 కాలేజీలు అఫిలియేషన్‌కు దరఖాస్తు చేయలేదు. సర్కారు స్కాలర్షిప్లు మంజూరు చేయకపోవడం ఇతరాత్ర కారణాలతో కాలేజీలు మూతపడుతున్నట్టు యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
గత కేసీఆర్ సర్కారు రాష్ట్రంలో పెద్దఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసింది. 2014లో రాష్ట్రంలో 298 గురుకులాలుండగా, 2023 నాటికి 1,200 పైచిలుకు గురుకులాలను ఏర్పాటు చేసింది. అంటే ఈ పదేండ్ల కాలంలో వెయ్యి వరకు కొత్త గురుకులాలను నెలకొల్పింది. పదో తరగతి వరకు ఉన్న గురుకులాలను ఇంటర్, డిమాండ్‌ను బట్టి డిగ్రీ వరకు అప్గ్రేడ్చేసింది. బీఆర్ఎస్ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా ఈ గురుకులాలు నడిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ గురుకులాలను గాలికొదిలేసింది. క్రమంగా నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా గురుకులాల్లో పాముకాట్లు, ఎలుకగాట్లు, ఫుడ్ పాయిజన్లతో పరిస్థితి అస్తవ్యస్థంగా తయారయ్యింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు గురుకులాలపై నమ్మకం సడలుతున్నది. ఈక్రమంలోనే గురుకులాలను మూసివేసేందుకు సర్కారు పావులు కదుపుతున్నదన్న వాదనలొస్తున్నాయి. సమీకృత గురుకులాల కోసమే కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గురుకులాలను మూసివేస్తున్నదన్న ఆరోపణలొస్తున్నాయి. 105 కొత్త సమీకృత గురుకులాలను దీంట్లో భాగంగానే మంజూరుచేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.