హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో వలసలను నివారించి, పేదలకు ఉపాధితోపాటు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం లోపించింది. పెద్దమొత్తంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ విషయం ప్రతియేటా గ్రామాల్లో నిర్వహించే సోషల్ ఆడిట్లో వెల్లడైనా రీకవరీల్లో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో రూ.191 కోట్ల ఉపాధి నిధులు దుర్వినియోగం అయితే, రికవరీ అయింది రూ.5.83 కోట్లు (3 శాతం) మాత్రమే. ఏటేటా ఉపాధి పేరాలు పెరుగుతున్నా, అక్రమాలు జరుగుతున్నా, అధికారులు మాత్రం రికవరీలు చేపట్టడం లేదు.
కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) వెబ్సైట్లో శనివారం నాటి గణాంకాల ప్రకారం.. తెలంగాణలోని 12,975 గ్రామాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4,734 గ్రామాల్లో (36.49 శాతం) సోషల్ ఆడిట్ నిర్వహించారు. సోషల్ ఆడిట్లో రూ.8.44 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్టు గుర్తించగా, కేవలం రూ.8 వేలు (0.01 శాతం) రికవరీ చేశారు. 2024- 25లో రూ.24.55 కోట్లు దుర్వినియోగం అయితే, కేవలం రూ.15.48 లక్షలు రికవరీ చేశారు. 0.65 శాతం మాత్రమే రివకరీ అయ్యింది. అవినీతికి చెక్ పెట్టాల్సిన అధికారులు అలసత్వం వహించడంతోనే ప్రజాధనం పెద్దమొత్తంలో దుర్వినియోగం అవుతున్నదనే విమర్శలు ఉన్నాయి.
గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన స్పెషల్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పేరాల క్లోజింగ్, రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, కూలీల పని దినాలు, వారి సమస్యల పరిష్కరించడంపై ఉమ్మడి జిల్లాలవారీగా అన్ని జిల్లాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన 30 రోజుల్లోపు అన్ని ఫిర్యాదుల పేరాలను పరిషరించి, ఏటీఆర్‌ను అప్లోడ్ చేయాలని డీఆర్డీవోలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలను ఆదేశించినట్టు వెల్లడించారు. ఆర్థిక దుర్వినియోగం జరిగినట్టు తేలితే వెంటనే రికవరీతోపాటు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు.