హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182.48 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బడ్జెట్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు. ఇటీవల బెటాలియన్ కానిస్టేబుళ్లు ఉద్యమించిన డిమాండ్లలో సరెండర్స్ బడ్జెట్ కూడా ఒకటి. సివిల్, ఏఆర్ పోలీసుల్లోనూ అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో సరెండర్ లీవ్స్ బడ్జెట్‌ను విడుదల చేసింది. పెండింగ్ బిల్లుల గురించి ప్రస్తావిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ‘పోలీసుల పొట్టగొడుతున్న ప్రభుత్వం’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి మంచి స్పందన రావడంతో సరెండర్ లీవ్‌ల బడ్జెట్ రూ.182.48 కోట్లను విడుదల చేసింది. పోలీసు సిబ్బంది, సంఘాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
పోలీసులకు చెల్లించాల్సిన డీఏలు ఐదు ఉండగా.. ఇటీవల దీపావళికి ఒక డీఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా డీఏలతోపాటు పెండింగ్ బిల్లులు, వారాంతపు సెలవును మంజూరు చేయాలని పోలీసులు కోరతున్నారు.