Kothagudem | హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల గుంతలు.. ఓ 18 నెలల బాలుడి ప్రాణాలను తీశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని నడికుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
నడికుడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ఓ వ్యక్తి గుంతలు తవ్వి పెట్టాడు. అయితే గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ గుంతలు జలమయం అయ్యాయి. శుక్రవారం ఉదయం 18 నెలల బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటూ, ఆ గుంతల వైపు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వాటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
కుమారుడు కనిపించడం లేదని చెప్పి తల్లి అమ్మాజీ ఇంటి పరిసరాల్లో వెతికింది. ఎక్కడా కూడా బాలుడి ఆచూకీ కనిపించలేదు. కాసేపటికి ఇందిరమ్మ ఇండ్ల గుంతలో బాలుడు తేలియాడుతూ కనిపించింది. అప్రమత్తమైన తండ్రి తుష్టి సురేశ్.. కుమారుడిని నరసాపురం పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్ సుభాష్ నిర్ధారించారు.
దీంతో తల్లిదండ్రులు సురేశ్, అమ్మాజీ గుండెలవిసేలా రోదించారు. పెళ్లైన పదేండ్లకు తమకు సంతానం కలిగిందని, ఇప్పుడు ఉన్న ఒక్క కుమారుడు తమకు లేకుండా పోయాడని బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.