వరంగల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల కోటాను పెంచాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18 శాతానికి పెరిగిందని, దీని ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లను 18 శాతానికి పెంచి మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అభ్యంతరాలను స్వీకరించి, తుది ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తవుతున్నని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తానని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.