హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఏకంగా రూ.175 కోట్ల భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షంషీర్గంజ్ ఎస్బీఐలో అనుమానాస్పద ఖాతాల ద్వారా భారీ సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ వెల్లడించారు. షంషీర్గంజ్ ఎస్బీఐలోని 6 అనుమానాస్పద బ్యాంకు ఖాతాల్లోకి భారీగా జరిగిన లావాదేవీలపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టామని శిఖాగోయల్ తెలిపారు. విచారణలో సంబంధిత నకిలీ ఖాతాల నుంచి భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని వెల్లడించారు. నిందితులు పేదల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. సైబర్ నేరాలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని వివరించారు. ఆ నగదును క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్‌కి తరలించినట్టు గుర్తించామని చెప్పారు.
సుమోటోగా కేసు నమోదు
బ్యాంకు అధికారుల సమాచారంతో ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఎన్సీఆర్పీ పోర్టల్‌లో షంషీర్గంజ్ ఎస్బీఐలోని 6 బ్యాంకు ఖాతాలపై 600కుపైగా ఫిర్యాదులు వచ్చినట్టు గుర్తించింది. వాటిని క్షుణ్ణంగా విశ్లేషించగా.. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో రూ.175 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలింది. నగరానికి చెందిన పలువురు పేదలకు కమీషన్ ఆశచూపి, వారితో ఈ బ్యాంకు అకౌంట్లు తీయించారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఆ ఖాతాదారుల సమాచారంతో విచారణ జరిపి.. ఈ నెల 24న మసాబ్ట్యాంట్ విజయ్‌నగర్‌కాలనీకి చెందిన మహమ్మద్ షూబ్ తౌకీర్, మొగల్పురాకు చెందిన మహ్మద్ బిన్ అహ్మద్ బవాజీర్ను అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
దుబాయ్ నుంచే ఆపరేషన్
అరెస్టయినవారు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పేదల ద్వారా ఖాతాలు తెరవటం, సైబర్ నేరాల్లో వచ్చే సొమ్మును ఆ ఆరు ఖాతాలకు మళ్లించటం, ఆ ఖాతాదారులకు కమీషన్ ఇవ్వటం, డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చడం వరకు.. ఆ ప్రధాన నిందితుడి హస్తం ఉ న్నట్టు తేల్చారు. అకౌంట్లు తెరవటంతో కీలకంగా వ్యవహరించిన తౌకీర్.. మార్చి, ఏప్రిల్‌లో జరిగిన రూ.175 కోట్ల లావాదేవీల్లో కొంత డబ్బును క్రిప్టోగా మార్చి.. మిగిలిన డబ్బును ప్రధాన నిందితుడు చెప్పిన ఏజెంట్లకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ భారీ సైబర్ కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టామనట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఆపరేషన్ పాల్గొన్న ఎస్పీ దేవేందర్‌సింగ్, డీఎస్పీలు హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు డీ శ్రీను, మహేందర్, కానిస్టేబుళ్లు వెంకట్‌గౌడ్, సయ్యద్ తాహెర్, కృష్ణస్వామి, శంకర్‌ను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా.. ‘మీ పేర్లపై ఎవరైనా నకిలీ ఖాతాలు తెరిచేందుకు కమీషన్లు ఇస్తామన్నా, ఏవైనా ఆఫర్ చేసినా వాటికి ఆశపడితే.. వారు కూడా నేరస్థులే అవుతారు. ఇలాంటి నేరాలపై వెంటనే మాకు సమాచారం ఇవ్వండి లేదా 1930కి కాల్ చేయండి’ అని ప్రజలకు శిఖాగోయల్ విజ్ఞప్తి చేశారు.