నర్సింహులపేట, మార్చి 21: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన 14 మంది, ఫతేపుంర గ్రామానికి చెందిన ముగ్గురు మొత్తం 17 మంది మహిళా కూలీలు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలంలో మిర్చి ఏరడానికి ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దనాగారం స్టేజీ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద ఎదురుగా వస్తున్న లారీ.. ఆటోను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. అందులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మూడు అంబులెన్సుల్లో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.