– వారిలో ఆరుగురు మహిళలు
– వివరాలు వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు
కొత్తగూడెం ప్రగతి మైదాన్ 30, మే : మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు, సభ్యులు వరుసగా లొంగుబాటు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే జిల్లా పోలీసుల ఎదుట ఆరుగురు మహిళా సభ్యులతో సహా 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు.
లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, నలుగురు పార్టీ సభ్యులు, 11 మంది మిలీషియా సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 282 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు లొంగిపోయినట్లు వివరించారు. వారిలో ఒక డీవీసీఎం, 13 మంది ఏరియా కమిటీ/ పీపీసీ సభ్యులు, 32 మంది పార్టీ సభ్యులు, 105 మంది మిలీషియా సభ్యులు, 33 మంది ఆర్పీసీ సభ్యులు, 47 మంది డీఏకేఎంఎస్/ కేఏఎంఎస్, 30 మంది చైతన్య నాట్యమండలి, 21 మంది గ్రామ రక్షక దళ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల ములుగు జిల్లా పోలీసులు 20 మంది మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి 12 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మిగతా మావోయిస్టులంతా అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. అనంతరం మావోయిస్టులకు ప్రోత్సాహక నగదు చెక్కులను ఎస్పీ అందజేశారు. ఈ సమావేశంలో కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) గోపతి నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, 141వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ప్రీతా, 81వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రవిశర్మ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చర్ల సీఐ రాజు వర్మ, ఆర్ఐ (ఆపరేషన్స్) రవి పాల్గొన్నారు.
Kothagudem Pragathi Maidan : కొత్తగూడెం పోలీసుల ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగుబాటు
Kothagudem Pragathi Maidan : కొత్తగూడెం పోలీసుల ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగుబాటు