హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ చెల్లింపుల వేదిక ‘టీ-వాలెట్’ నుంచి దాదాపు 16 లక్షల మంది వినియోగదారుల సమాచారాన్ని ప్రైవేట్ యాప్‌లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగాయని సీసీఎస్ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గతంలో ‘టీ-వాలెట్’ కార్యకలాపాలను నిర్వహించిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ యాప్‌లోని వినియోగదారుల డాటాను తన సొంత ‘టీఏ-వాలెట్’ యాప్‌లోకి వినియోగదారులను మళ్లించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. దీనిపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ ఆ సంస్థ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. సీసీఎస్ ఏసీపీ ఏ రామ్‌రెడ్డి దాఖలు చేసిన ఈ కౌంటర్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
నోట్ల రద్దు అనంతరం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 లో టీ-వాలెట్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా సంస్థకు అప్పగించిందని, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రజలకు దాదా పు 1,200 రకాల సేవలను అందించేవారని తెలిపారు. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియాతో కుదిరిన ఒప్పందం 2025 మే 31తో ముగిసిందని, ఆ తర్వాత టీ-వాలెట్‌కు సంబంధించిన మొత్తం డేటా, సోర్స్ కోడ్, సిస్టమ్ యాక్సెస్, ఇతర సాంకేతిక నియంత్రణ వివరాలను ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఆ సంస్థ కావాలనే వాటిని ఇవ్వలేదని వివరించారు. టెండర్ల ద్వారా కొత్తగా ఎంపికైన పర్వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్వీసెస్ సంస్థకు కూడా అవసరమైన సాంకేతిక వివరాలు అందజేయకుండా అడ్డంకులు సృష్టించిందని, దీంతో ప్రభుత్వ సేవలు కొనసాగించేందుకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
‘టీ-వాలెట్’లోని దాదాపు 16 లక్షల మంది వినియోగదారుల కేవైసీ వివరాలు, ప్రజానిధులకు సంబంధించిన సున్నిత సమాచారం ఇప్పటికీ పాత సం స్థ ఆధీనంలోనే ఉన్నదని పేరొన్నారు. వినియోగదారుల డాటాను ‘టీఏ-వాలెట్’ యాప్‌లోకి మళ్లించేందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా ప్రయత్నించడంతోపాటు ‘టీఏ-వాలెట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వినియోగదారులకు సందేశాలు పంపిందని, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌పై గందరగోళం సృష్టించిందని పేర్కొంటూ.. ఇది మోసం, నమ్మకద్రోహానికి సమానమైన నేరమని హైకోర్టుకు వివరించారు.
‘టీ-వాలెట్’ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం దాదా పు రూ.70 లక్షలు వెచ్చించడంతోపాటు ఆ యాప్ నిర్వహణ కోసం ప్రతినెలా భారీగా డబ్బు చెల్లించిందని పోలీసులు తెలిపారు. ఆ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ‘టీ-వాలెట్’పై తమకే హకులున్నట్టు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా తప్పుడు వాదన చేస్తున్నదని, ఆ సంస్థ నుంచి ప్రభుత్వానికి దాదాపు రూ.14 కోట్లు రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ కేసులో సంస్థ ఎండీ, సీఈవో కాటూరి శ్రీనివాసరావు, ప్రాజెక్ట్ చీఫ్ ఎం శ్రీనివాసులు, మేనేజర్ పీ కిరణ్ కుమార్‌ను నిందితులుగా చేర్చామని, వీరిలో ఏ-3గా ఉన్న శ్రీనివాసులు ఇప్పటికే అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ ఇండియా క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై వచ్చే నెలలో హైకోర్టు విచారణ జరుపనున్నది.