హైదరాబాద్: సౌదీ బస్సు ప్రమాద ఘటనపై (Saudi Bus Accident) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. తక్షణం సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యల కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాలకోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కాగా, మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లిలోని బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తున్నది. వీరంతా ఉమ్రా ట్రావెల్స్ ద్వారా మక్కా యాత్రకు వెళ్లినట్లు సమాచారం.
మక్కా యాత్రకు వెళ్లిన (Umrah Pilgrims) భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో 42 మంది సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇంగ్లిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. వారంతా మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్నారని పేర్కొన్నాయి. మృతుల్లో 20 మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.