Minister Seethakka | వరంగల్, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేశామని గొప్పలు చెప్తుంటే.. స్వయానా అదే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క సొంతూరు జగ్గన్నపేటలో ఎక్కువ మందికి రుణాలు మాఫీ కాలేదు. దీంతో ‘సీతక్కా.. మా రుణాలు మాఫీ కాలేదక్కా’ అంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. రుణాలు మాఫీ చేయించుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అలిసిపోతున్నారు. పొలం పనులు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కేవలం 20 శాతం మంది రైతులకే రుణాలు మాఫీ అయ్యాయని విమర్శిస్తున్నారు. అది కూడా రూ.లక్ష లోపు ఉన్న రుణాలే మాఫీ అయిన జాబితాలో ఉన్నాయని, రూ.లక్షపైన ఉన్న రుణాలు మాఫీ కాలేదని పెదవి విరుస్తున్నారు.
అంతిమంగా.. పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) సొంతూరు ములు గు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటలో రుణమాఫీ పథ కం అటకెక్కిందని రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇక.. జాబితాలో ఉన్న రైతులు బ్యాంకులకు వెళ్లి మళ్లీ లోను కావాలని అడిగితే.. వడ్డీ పైసలు చెల్లిస్తేనే లోను ఇస్తామని బ్యాంకర్లు చెప్తున్నట్టు పేర్కొన్నారు. సీతక్క గ్రామపంచాయతీ పరిధిలో అన్నంపల్లి, సారంగపల్లి, చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, ఆరెపల్లి అనుబంధ గ్రామాలున్నాయి. అన్ని కలిపి ఈ పంచాయతీ పరిధిలో 820 కుటుంబాలు, 1750 ఓటర్లు ఉన్నారు. గ్రామపంచాయతీలో 1,580 మంది రైతులకు బ్యాం కు ఖాతాలు ఉన్నాయి. ములు గు జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకు (దేవగిరిపట్నం), ఎస్బీఐ(ములుగు), పీఏసీఎస్(ములుగు)లో జగ్గన్నపేట గ్రామ రైతులు పంట రుణాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో చేసిన రుణమాఫీ కేవలం 318 మంది రైతులకే వర్తించింది. మిగతా 80 శాతం మంది రైతులకు ఈ పథకం వర్తించలేదు.
అప్పుడు అయినోళ్లకు ఇప్పుడు కాదన్నరు
నాకు 1:22 గుంటల భూమి ఉంది. 2015లో రూ.30 వేల అప్పు తీసుకుంటే.. కేసీఆర్ సర్కారు 2023లో రూ.40 వేలు మాఫీ చేసింది. ఇంకో రూ.26 వేల అప్పు ఉండె. ఇప్పుడు మొదటివిడతల నా పేరు రాలేదెం దుకంటే గతంల మాఫీ అయినోళ్లకు ఇప్పుడు అయితలేవని చెప్తే, మొత్తం అప్పు తీర్పిన. మళ్ల లోన్పెంచి అకౌంట్లో జమ చేస్తామని చెప్పిండ్లు.
-దోబె ముత్తయ్య, జగ్గన్నపేట, ములుగు మండలం, ములుగు జిల్లా
అందరికీ మాఫీ చెయ్యాలె
నాకు 1:25 గుంటల భూమి ఉంది. బ్యాంకులో రూ.35 వేలు అప్పు ఉంది. 2023లో కేసీఆర్ ఉన్నప్పుడు రూ.30 వేలు మాఫీ అయినయి. అప్పుడు మళ్లీ తీసుకున్న అప్పు ఉన్నది. రుణ మాఫీ ఫస్ట్ లిస్టుల నా పేరు లేదు. ఎవుసం చేసేటోళ్లు అందరికీ మాఫీ ఇయ్యాలె.
-ఈసం సారక్క, జగ్గన్నపేట, ములుగు మండలం, ములుగు జిల్లా