హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచడంపై టీజీఎస్ఆర్టీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 187, జిల్లాల్లో 87 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టగా.. నాలుగు నెలల్లో గ్రేటర్ పరిధిలో మరో 150 బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, హెచ్సీయూ, జేబీఎస్ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా, తాజాగా హయత్నగర్, రాణిగంజ్ డిపోల్లో మరో రెండు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.9 కోట్లు చెల్లించింది. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.