వికారాబాద్, డిసెంబర్ 22, (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమలు ఏటా రూ.8 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తూ విజయం సాధిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో ఎలా సక్సెస్ అవుతున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు వికారాబాద్ జిల్లాలో గురువారం పర్యటిస్తున్నారు. బంట్వారం మండల కేంద్రానికి చెందిన రైతు కల్కొడ చంద్రప్ప-అమృతమ్మ దంపతులతో మాట్లాడి విజయ గాథ తెలుసుకున్నారు. 2018 ఫిబ్రవరిలో పొందిన ఒక యూనిట్ గొర్రెల ద్వారా ఏటా చంద్రప్ప ఆదాయం పెరుగుతూ వస్తున్నది. తొలి ఏడాది రూ.లక్ష, రెండో ఏడాది 2లక్షలు, మూడో ఏడాది రూ.4 లక్షలు, తదుపరి ఏడాది 8 లక్షలు ఆదాయం వచ్చిందని చంద్రప్ప సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం కానున్నదని దూదిమెట్ల బాలరాజు వెల్లడించారు.