సిటీబ్యూరో: వాహనం కొనాలంటే మోస పోవాల్సిందే అన్నట్టుగా అటు షోరూంలు.. ఇటు ఆర్టీఏ అధికారులు సామాన్యులను ఆగం చేస్తున్నారు. వాహన ధర వివరాలను తప్పుడు లెక్కలతో పేపర్‌పై మాయాజాలం చేస్తున్నారు. చివరికి లెక్కకు మించిన డబ్బులు కోల్పోయి జేబులు చిల్లుపెట్టుకోవాల్సిన దుస్థితి సామాన్యులవుతున్నది. గ్రేటర్లో కొత్త బండి కొనాలంటే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఉంది. షోరూం ధర మినహా మిగిలిన ప్రతీ వసూళ్లలో రెట్టింపు ధరలు వేస్తూ షోరూంలు చేతివాటం చూపిస్తున్నాయి. ఆర్టీఏ కార్యాలయాలు పట్టించుకోకపోవడంతో షోరూంలు వినియోగదారులను బకరాలను చేస్తున్నాయి. ఒకే చార్జీ పేరుతో ఆర్టీఏ.. షోరూంలు డబ్బులు వసూలు చేస్తున్నాయి.
ఒక్క బండికి ఇన్ని పన్నులా..?
ప్రతాప్ అనే వ్యక్తి 125సీసీ స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్ ధర బేసిక్ రూ. 78,636 ఉంది. ఇందులో వెయ్యి రూపాయలు కస్టమర్‌కు డిస్కౌంట్ ఇచ్చినట్టు చూపించి 77,095 చేశారు. దీనికి సీజీఎస్టీ పేరుతో 9 శాతం అంటే 6,938, మరో ఎస్జీఎస్టీ పేరుతో 9 శాతం 6,938 జత చేశారు. .90,972 రూపాయలైంది. స్లాబ్‌ల వారీగా లైఫ్ ట్యాక్స్ ప్రకారం 12 శాతం.. రూ. 10,916 అయింది. బండి ధర రూ. 1,01,888 అవుతుంది. రోడ్డు సెస్‌తో రూ.2వే లతో 1,03,888 అయింది. రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ఆర్టీఏ చార్జీలు అదనంగా హెచ్‌పీఏ ఫీజు రూ. 500, టీఆర్ 150, అప్లికేషన్ ఫీజు రూ.300, స్మార్ట్ కార్డ్ ధర రూ.200, పోస్టల్ చార్జీ రూ.35, రిజిస్ట్రేషన్ సర్వీస్ చార్జీ రూ.470 వసూలు చేశారు. ఇందులో పెనాల్టీ పేరుతో కూడా 115 రూపాయలు అదనంగా వేశారు. దీంతో ఆర్టీఏ చార్జీల పేరుతో రూ.1,770 రూపాయలు వసూలు చేశారు. మొత్తం ధర ఇప్పుడు 105,658 అయింది.
ఏజెంట్ ఖర్చుల పేరిట..
ఇప్పటి వరకు అన్నీ పన్నులు చెల్లించినప్పటికీ ఇప్పుడు మరో వసూళ్ల పర్వం షోరూం నిర్వాహకులు మొదలుపెడుతున్నారు. వాహన లైఫ్ ట్యాక్స్ అంటూ రూ.500 నుంచి 2 వేల వరకు అదనంగా లెక్కలు చూపిస్తున్నారు. ఆర్టీఏ చార్జీలు చెల్లించినప్పటికీ అదనంగా వెయ్యి రూపాయలు వసూలు చేశారు. ఈ లెక్కన నెలకు గ్రేటర్లో 30 వేల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. అంటే వెయ్యి రూపాయల లెక్కన నెలకు షోరూంలు ఆర్టీఏ ఏజెంట్ ఖర్చులు అంటూ రూ. 3 కోట్లు సామాన్యుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆర్టీఏ కమిషనర్ దృష్టికి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అన్ని ఆర్టీఏ చార్జీలతో డబ్బులు చెల్లించినప్పటికీ షోరూం వాళ్లు అదనంగా ఆర్టీఏ పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారని అడిగినా స్పందించవారు లేరు. అటు ఆర్టీఏ అధికారుల దృష్టికి రాజు అనే వ్యక్తి తీసుకెళ్లినా మౌనం వహించడం విశేషం. దీనికి తోడు అదనంగా అంటే గోదాం నుంచి బండి షోరూంకి తీసుకువచ్చినందుకు రూ.300లు చార్జీ వేస్తున్నారు. డాక్యుమెంటేషన్, ప్రాసెస్ ఫీజు అంటూ మరో 300లు వసూలు చేస్తున్నారు. యాక్సెసరీస్ పేరుతో రూ.5వేలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. యాక్సెసరీస్ అవసరం లేదని చెప్పినప్పటికీ తప్పనిసరి అంటూ వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ పెనాల్టీ చార్జీ అంటూ అదనంగా 115 వసూలు చేస్తున్నారు. కొత్త బండికి పెనాల్టీ ఏముంటుందో వారికే తెలియాల్సి ఉందని వాహనదారులు వాపోతున్నారు.