చేర్యాల, జూన్ 22 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల వసతుల కోసం 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రారంభించిన డోనార్ స్కీంకు దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని ఈవో అన్నపూర్ణ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బొద్దుల రామన్దేవిక దంపతులు 100 కాటేజీలలో ఒక్క కాటేజీ నిర్మాణం కోసం రూ.15 లక్షల విరాళాన్ని ఆదివారం ఆలయంలో ఈవోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కాటేజీల నిర్మాణం కోసం ఇప్పటి వరకు దాతల నుంచి రూ.95 లక్షలు విరాళంగా అందినట్టు తెలిపారు. విరాళాలు సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మరిన్ని విరాళాలు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
దాత డాక్టర్ రా మన్ మాట్లాడుతూ 45 సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నానని, ఇలవేల్పు క్షేత్రంలో కాటేజీ నిర్మించేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. డాక్టర్ రామన్దేవిక దంపతులకు అర్చకులు స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు సురేందర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.