హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసింది. ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసిన పంపిణీదారులకు రూ.35 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో బకాయిల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు అలసత్వంపై ‘ఎంఎన్జే బకాయిలు 35 కోట్లు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 19న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ అంశం వైద్యారోగ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.15 కోట్లు విడుదల చేసినట్టు హాస్పిటళ్ల సప్లయర్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.