హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): విభజన చట్టం అమలులో భాగంగా ఏపీకి వెళ్లి తిరిగివచ్చిన 145 మంది తెలంగాణ ఉద్యోగులు మళ్లీ సచివాలయంలో విధుల్లో చేరనున్నారు. వారిని సచివాలయంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగులు శనివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం 145 మంది కూడా క్లాస్ 3, 4 ఉద్యోగులేనని గతంలో 25 ఏండ్లు సచివాలయంలో పనిచేశామని, విభజన చట్టంలో భాగంగా 52:48 నిష్పత్తిలో ఏపీకి వెళ్ళామని వివరించారు.
2021లో తెలంగాణకు వచ్చినా.. ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేశామని, దీనివల్ల సీనియారిటీ నష్టపోయామని, ఇన్ని రోజులు వేదనకు గురయ్యామని చెప్పారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్‌రెడ్డికి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.