హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యం, ప్రజాహక్కుల పునరుద్ధరణే మా 7వ గ్యారెంటీ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏడాది పాలనలో 14 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల ఘటనల్లో మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడించింది. గత 11 నెలల్లో మొత్తం నాలుగు ఎన్కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు హతమైనట్టు వార్షిక క్రైమ్ నివేదికలో వెల్లడించింది. మృతుల్లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఇద్దరు డివిజన్ కమిటీ సభ్యులు, ఐదుగురు ఏసీఎంలు, ఆరుగురు డీఎంలు ఉన్నట్టు తెలిపింది. వారి నుంచి 24 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. మొత్తంగా 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, వారిలో ఒకరు స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ఒకరు రాష్ట్ర కమిటీ సభ్యుడు, మరొక రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపింది. కాగా గత 11 నెలల కాలంలో 16 మందిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కోవర్టుల ద్వారా మత్తుమందు పెట్టి మావోయిస్టులను నిర్బంధించి, ఆపై కాల్చి చంపుతున్నారని పేర్కొంటున్నారు.