హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : గురుకులాల పరిస్థితి కేసీఆర్ హయంలోనే బాగాలేదని, రేవంత్‌రెడ్డి పాలనలో అద్భుతంగా ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎక్కడ అద్భుతంగా ఉన్నాయో చూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణభవన్‌లో మంగళవారం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మణ్ అహగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో 110 మందికిపైగా విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని ఆవేదనన వ్యక్తంచేశారు. ఇది విద్యార్థులకు తిండిపెట్టని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు.
గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరచి గురుకులాల స్థితిగతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఊహల్లో ఊరేగుతూ కేసీఆర్‌పై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. గురుకులాల్లో జీవో-17 తెచ్చి తొమ్మిది వేల మంది చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొట్టారని, ఐదారు నెలలుగా వారికి బిల్లులు ఇవ్వకపోగా ఇప్పుడు వారి సేవలనే వద్దనుకుంటున్నారని విమర్శించారు. గురుకులాల్లో కోడి గుడ్ల ధర పెంచి రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ఇందులో మంత్రి లక్ష్మణ్‌కుమార్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో చనిపోయిన 110 మంది విద్యార్థుల జాబితా ప్రభుత్వానికి పంపుతున్నానని, ఆయా విద్యార్థుల కుటుంబాలను పరామర్శించే తీరిక మంత్రికి లేదా? అని ప్రశ్నించారు.
గ్రూప్-1 విషయంలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఈ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఎంతోమంది అభ్యర్థులు తెలంగాణభవన్‌కు వచ్చి కేటీఆర్‌తో మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ అమల్లో రేవంత్ సరార్ విఫలమైందని మండిపడ్డారు. నిరుద్యోగులకు రేవంత్ తక్షణమే క్షమాపణ చెప్పి.. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చదువుల గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తన చదువు వివరాలు బహిర్గతం చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్‌కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 మందిని ఎంపిక చేయాలని ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార డిమాండ్ చేశారని, కానీ 1:50 మందినే పిలిచారని విమర్శించారు. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నేతలు గౌతంప్రసాద్, సత్యవతి, అరుణ పాల్గొన్నారు.