మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ
జూలై 15 నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు,
దివ్యాంగులకు పదేండ్లు వయో పరిమితి మినహాయింపు
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 1,326 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,326 డాక్టర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్-1 503 పోస్టులు, పోలీసుశాఖలో 17,291 పోస్టులు, టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1,271 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన 1,326 వైద్య పోస్టుల కోసం జూలై 15వ తేదీ ఉదయం 10.30 నుంచి ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నియామక బోర్డు స్పష్టంచేసింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వైద్యులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకొని పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా నెల గడువు ఇచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసిన వారికి 20 పాయింట్లు వెయిటేజీ ఇస్తున్నట్టు తెలిపింది. ఆరు నెలలు గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2.5 పాయింట్లు కలుపుతామని తెలిపింది. వైద్య పోస్టులను మల్టీజోనల్వారీగా భర్తీచేయనున్నారు.
ఎంబీబీఎస్ అభ్యర్థులు అర్హులు
వైద్య పోస్టులకు ఎంబీబీఎస్ లేదా దానికి సమానమైన డిగ్రీ అర్హత ఉండాలని నియామక బోర్డు తెలిపింది. తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టీఎస్ఆర్టీసీ, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులు మినహాయించి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు ఇచ్చింది. ఎక్స్ సర్వీస్మెన్లకు, ఎన్సీసీలో పనిచేస్తున్నవారికి మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వయసు సడలింపు ఇచ్చింది. వివరాలకు https://mhsrb. telangana.gov.in చూడాలని బోర్డు తెలిపింది.
నిరుద్యోగులకు శుభవార్త: మంత్రి హరీశ్‌రావు
డాక్టర్ పోస్టుల భర్తీపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ట్వీట్ చేశారు. నిరుద్యోగులకు శుభవార్త అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1,326 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.