ఆదిలాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కాలేదని గత ఏడాది నిరసన తెలిపిన పాపానికి సర్కార్ 13 మంది రైతులను కోర్టుకు లాగింది. ఈ మేరకు సదరు రైతులకు సమన్లు రావడంతో గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన 13 మంది రైతులు గతేడాది ఆగస్టు 18న ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు.
ఈ ఘటనకు సంబంధించి తలమడుగు పోలీస్ స్టేషన్లో నిమ్మల సుదర్శన్‌రెడ్డి, పుండ్రు పోతారెడ్డి, గోక లక్ష్మారెడ్డి, పుండ్రు ఉపేందర్‌రెడ్డి, బహదూర్ నర్సింలు, నక్క ధనుంజయ్, ఉరుకొండ దత్తు, అల్లూరి సతీశ్‌రెడ్డి, నిమ్మల సూర్యసేనారెడ్డి, కుమ్మరి భూమన్న, గోక విపుల్రెడ్డి, ఈరవెన లక్ష్మన్న, కాకర్ల అశోక్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆదిలాబాద్ కోర్టుకు హాజరుకావాలని సమన్లు రావడంతో సదరు 13 మంది రైతులు గురువారం న్యాయస్థానానికి వచ్చారు. ఈ కేసును డిసెంబర్ 19కి వాయిదా పడిందని రైతులు తెలిపారు.
నేను ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామీణ బ్యాంకులో రూ.1.75 లక్షల పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ వర్తించలేదు. మా గ్రా మంలో సీఎం దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపినం. హామీ నెరవేర్చాలని అడిగినందుకు కేసులు పెట్టిండ్రు. దీంతో గురువారం ఆదిలాబాద్ కోర్టుకు వచ్చినం.
– గోక లక్ష్మారెడ్డి, రైతు, రుయ్యాడి, మం: తలమడుగు
నేను తలమడుగు మండలం సుంకిడి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.25 లక్షలు పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ వర్తించలేదు. గతేడాది ఆగస్టు 18న మా గ్రామంలో రైతులంద రం కలిసి నిరసన తెలిపినం. 13 మందిపై పోలీసులు కేసు పెట్టిన్రు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.
– నక్క ధనుంజయ్, రైతు, రుయ్యాడి, మం:తలమడుగు