Municipal Elections | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీ పాలకమండళ్ల గడువు ఈ నెల 26తో ముగుస్తుంది. ఆ మరుసటిరోజు నుంచే స్పెషల్ అధికారు ల పాలన అమల్లోకి రానున్నది. ప్రస్తుత పాలక మండళ్ల గడువు ముగిసేలోగానే ఎన్నిక లు పూర్తిచేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించడమే లేదు. దీంతో పురపాలన అస్తవ్యస్తమవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిరుడే గడువు ముగిసిన పంచాయతీలలోనే ఇంతవరకు ఎన్నికలు ని ర్వహించలేదు. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు తక్కువగానే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతకు ముందే బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క తేలాలి. ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నివేదికను అనుసరించి మున్సిపాలిటీ ల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 10 రోజుల్లో మున్సిపల్ పాలక మండళ్ల గడువు ముగియనున్న నేపథ్యంలో మూలకు పడిన పనులకు మోక్షం కల్పించారు. ఆ పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఆగమేఘాలపైన రాత్రికి రాత్రే పనులు చేపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందే పనులన్నింటినీ ఒకేసారి పూర్తిచేసే హడావుడి నెలకొన్నది.
ఇప్పుడు కొనసాగుతున్న ఆయా పనులన్నీ బీఆర్ఎస్ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల ముందే మొదలు పెట్టారు. 25% పనులు కూడా పూ ర్తయినట్టు తెలిసింది. కానీ గత ఎన్నికల వల్ల ఆయా పనులు పెండింగ్లో పడ్డాయి. బీఆర్ఎస్ హయాంలో మొదలుపెట్టిన పనులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోక్షం లభించలేదు. ఆ పనులు పెండింగ్లో పడి ఏడాది దాటింది. ఉన్నట్టుండి పెండింగ్ పనులపైన కాంగ్రెస్ పాలకులకు ప్రేమ పుట్ట డం, హడావుడిగా పనులు మొదలు పెట్టడం, రాత్రికి రాత్రే రోడ్లు వేస్తుండటం, ఇందుకోసం యంత్రాంగం మొత్తం అక్కడే మకాం వేయ డం.. వంటి పరిణామాలు అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 10 రోజుల్లో పాలకమండళ్ల గడువు ముగుస్తుంది. వెంటనే ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి రాగా, అప్పుడు బిల్లులు మంజురు కావడం కొంతవరకు కష్టమే. పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్టు మమ అనిపించి, ప్రస్తుతం ఉన్న పాలక మండలిలోనే బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలన్న భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలుస్తున్నది.