Heart Attack | మహబూబాబాద్ రూరల్, నవంబర్ 15 : ఉపాధి కరువై.. కుటుంబం గడువక మనోవేదనకు గురైన ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం కొరుకొండపల్లికి చెందిన తుమ్మ జనార్దన్ (36) పదేండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి ఎలాంటి భూమి లేదు. ఇతని భార్య సైతం కూలీ పనులకు వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలకు గిరాకీ తగ్గింది. ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న తరుణంలో కుటుంబ అవసరాలకు, పిల్లల చదువుకు అప్పు చేశాడు. ఆటో పాతది కావడంతో దాని స్థానంలో ఫైనాన్స్‌లో కొత్త ఆటో కోసం శుక్రవారం మహబూబాబాద్‌లోని షోరూంకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో జనార్దన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జనార్దన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
చెన్నూర్ టౌన్, నవంబర్ 15 : గుండెపోటుతో పన్నెండేళ్ల చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. చెన్నూర్ పట్టణంలోని పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్-రమా దంపతులకు కూతురు నివృత్తి(12), కొడుకు ఉన్నారు. నివృతి చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్దే ఉన్నది. ఉదయం ఇంట్లో ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక దవాఖానకు తరలించారు. వైద్యు లు పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించారు.