భూపాలపల్లి రూరల్, ఆగస్టు 23 : ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ మధ్య గొడవలతో తాగునీటిలో ఓ ఉపాధ్యాయుడు పురుగులమందు కలుపగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీ (గాంధీనగర్)లోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శుక్రవారం కలుషిత నీరు తాగి 12మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.. శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సైన్స్ టీచర్ రాజేందర్ తాగేనీటిలో పురుగుల మందు కలిపి అనుమానం రాకుండా విద్యార్థుల దుప్పట్లపై కూడా చల్లారని తెలిపారు. ఈ విషయం బయటికి చెప్తే కొడతానని తమను బెదిరించాడని పేర్కొన్నారు.
సదరు ఉపాధ్యాయుడు ఎవరికీ అనుమానం రాకుండా అస్వస్థతకు గురైన విద్యార్థులతోపాటు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేరి వైద్య సేవలు పొందుతున్నాడని విద్యార్థులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయుల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని చెప్పారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. తాగునీటిలో పురుగులమందు కలిపిన ఉపాధ్యాయు డు రాజేందర్‌తోపాటు వేణు, సూర్యప్రకాశ్, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, మంచినీటి ట్యాంకులో పురుగులమందు కలిపితే విద్యార్థులు అస్వస్థతకు గురవుతారని, ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తే మళ్లీ తానే ఇన్చార్జి ప్రిన్సిపాల్ కావొచ్చనే ఉద్దేశంతో సైన్స్ టీచర్ రాజేందర్ ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం.