హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక ప్రగతికి కేసీఆర్ వేసిన బాటలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రంగం అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో వేసిన బలమైన పునాదులతో నేడు రాష్ర్టానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) మొదలుకొని భారీ పరిశ్రమల వరకు తెలంగాణ రాష్ర్టాన్ని తమ గమ్యస్థానంగా చూస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేసిన 12ఎంఎస్ఎం పార్కులు ప్రస్తుతం అందుబాటులోకొచ్చాయి. దీంతో టీజీఐఐసీ అర్హతగల ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపులు కూడా ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా పారిశ్రామికరంగ అభివృద్ధిలో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంతోపాటు పెద్ద ఎత్తున పారిశ్రామికవాడలను అభివృద్ధి చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల కోసం 1.5 లక్షల ఎకరాల ల్యాండ్బ్యాంక్ను సిద్ధంచేసి దాదాపు 28,458 ఎకరాల భూములను పరిశ్రమలకు కేటాయించారు. వివిధ జిల్లాల్లో 156 కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేశారు కూడా. సైబరాబాద్, మేడ్చల్-సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాల్లో టీజీఐఐసీ జోనల్ కార్యాలయాలను నెలకొల్పి జిల్లాలవారీగా పరిశ్రమల ఏర్పాటునకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు 21,921 యూనిట్లకు అనుమతులు జారీచేయగా, రూ. 2.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే, దాదాపు 18లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన 12 ఎంఎస్ఎంఈ పారిశ్రామికవాడలు అందుబాటులోకి వచ్చాయి.