హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం) పథకం కింద బుధవారం కేవీఐసీ (ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) దేశవ్యాప్తంగా 11,480 సేవారంగ లబ్ధిదారులకు రూ.300 కోట్లకుపైగా మార్జిన్ మనీ సబ్సిడీని విడుదల చేసింది. మొత్తం రూ.906కోట్ల రుణాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఈ సబ్సిడీని విడుదల చేసింది. దీనిలోభాగంగా దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరిలలో 4565 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 343కోట్ల రుణాలకుగాను రూ.116 కోట్ల సబ్సిడీని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కార్యాలయంలో కేవీఐసీ చైర్మన్ మనోజ్‌కుమార్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 10,18,185 సూక్ష్మ వాణిజ్య సంస్థలను ఏర్పాటు చేయగా, కేంద్ర ప్రభుత్వం రూ.73,348 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగింది. దీనికిగాను రూ.27,166 కోట్లకు పైగా మార్జిన్ మనీ సబ్సిడీని లబ్ధిదారులకు అందించారు. అలాగే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 90,04,541 మంది ఈ పథకం ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధిని పొందినట్టు అధికారులు తెలిపడం జరిగింది.