హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు, ఎంపీలు నిందితులుగా ఉన్న కేసుల సత్వర విచారణకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కోర్టులను హైకోర్టు ఆదేశించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కోర్టులో 20 కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలను జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 115 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు హైకోర్టు రిజిస్ట్రీ తరఫు న్యాయవాది తెలిపారు. వాటిలో 20 కేసులు సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ల దశలో ఉన్నాయని, మరో 48 కేసుల్లో సమన్లు అందలేదని, ఇంకో 10 కేసులు హైకోర్టులోనే పెండింగ్‌లో ఉన్నాయని, మరో 15 కేసుల్లో విచారణ జరుగుతున్నదని విచారించారు. దీంతో సీబీఐ కోర్టులోని 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లోగా పరిషరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. సమస్లు అందని 48 కేసుల్లో 2 వారాల్లోగా సమన్లు జారీ చేయాలని పేర్కొన్నది. 10 కేసుల్లోని స్టే తొలగింపు పిటిషన్లను కూడా సత్వరమే పరిషరించాలని తెలిపింది. ఈ ఆదేశాల అమలు తీరుపై నివేదిక సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది.