హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖకు కొత్తగా 110 మంది మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) రాబోతున్నారు. గతంలో ఎంవీఐలకు మూడు నెలల శిక్షణ ఉండేది. కొత్తవారికి ఈ వ్యవధిని పెంచడంతో పాటు విస్తృత శిక్షణ ఇవ్వనున్నారు. ఇటీవల ఇతర రాష్ర్టాల్లోని విధానాలపై అధ్యయనం చేసిన అధికారులు నివేదికను రవాణాశాఖకు అందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.8,478 కోట్ల భారీ రాబడి లక్ష్యాన్ని నిర్దేశించింది.
2024-25లో లైఫ్‌ట్యాక్స్ రూ.6,024.97 కోట్లు, త్రైమాసిక పన్ను , గ్రీన్ ట్యాక్స్ రూ.75.68 కోట్లు, ఫీజులు 648.10 కోట్లు, ట్రాఫిక్ చలాన్ల రూపంలో రూ.300 కోట్లు, బకాయిల వసూలు రూ.186.03 కోట్లు, యూజర్ చార్జీలు రూ.159.65 కోట్లు ఆర్జించాలని ఆర్థిక శాఖ నిర్ధారించింది. రవాణాశాఖకు రాబడి సమకూర్చే అంశాల్లో లైఫ్ ట్యాక్స్ ఒకటి. 2022-23లో రూ.5,345 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తే రూ.6,390.80 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో రూ.7,212.60 కోట్లకు రూ.6,990.29 కోట్లు వచ్చింది.