హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఎడతెగని జాప్యానికి.. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసింది. 2026 మార్చి 14 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 16తో ముగుస్తాయి. ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించనుండగా, దాదాపు నెల రోజులపాటు జరుగుతాయి. ఈ సారి నుంచి ఒక్కో పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఇచ్చారు. హిందీ పరీక్షకు మూడు, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, జీవశాస్త్రం, నాలుగు రోజులు, సోషల్ స్టడీస్‌కు ఐదు రోజులు సెలవులు వచ్చాయి.
పది రోజుల్లో ముగియాల్సిన పరీక్షలు నెల రోజులకు చేరాయి. సైన్స్‌కు తప్ప మిగతా పేపర్లకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ పేపర్లకు మాత్రమే ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు గంటన్నరపాటు పరీక్షలు జరుగుతాయి. దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు.
పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్, సెలవులు అధికంగా ఇవ్వడంతో లాభం కన్నా.. నష్టమే ఎక్కువ జరుగుతుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. పది రోజుల్లో ముగియాల్సిన పరీక్షలు నెల రోజులు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. రిజల్ట్స్ తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. తాము స్పెషల్‌క్లాసులు, స్లిప్ టెస్టులు నిర్వహించి, సబ్జెక్టువారీగా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేశామని.. ఇలాంటి తరుణంలో పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ అధికంగా ఇవ్వడంతో అంతా మరిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. నెల రోజుల షెడ్యూల్‌తో ఒత్తిడిని తగ్గించడం కాదని, ఒత్తిడిని పెంచినట్టు అవుతుందని మరికొందరు టీచర్లు పేర్కొంటున్నారు.
పరీక్షలపై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గి అసలుకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ గ్యాప్‌ను హాలిడేస్లా భావిస్తే ప్రిపరేషన్ వృథా అవుతుందని అంటున్నారు. పరీక్షల కోసం నెల రోజులు సెంటర్లు ఇస్తే.. స్కూళ్లల్లో మిగతా విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఇబ్బందులు వస్తాయని పేర్కొంటున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలను అధికారులు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. దీనిపై అధికారుల వాదన మరోలా ఉంది. సీబీఎస్ఈ పరీక్షల్లో మధ్య గ్యాప్ అధికంగా ఉందని, ఇదే తరహాలో తాము సెలవులు ఇచ్చామని వెల్లడించారు. పైగా ఇదే షెడ్యూల్లో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉన్నాయని దీంతో సెలవులు అధికంగా వచ్చాయని అంటున్నారు.
పదో తరగతి పరీక్షలను నెల రోజులకుపైగా నిర్వహించడం సరికాదని ఎస్టీయూ టీఎస్ అభిప్రాయపడింది. 33 రోజులపాటు పరీక్షలు నిర్వహించడంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రశ్నపత్రాలు భద్రపరచడం, మూల్యాంకనం చేయడం ఇబ్బంది అవుతుందని, పైగా ఏప్రిల్‌లో ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని అన్నారు. ప్రభుత్వం టైమ్ టేబుల్‌ను సవరించి, పది రోజుల్లో పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల షెడ్యూల్ అసంబద్ధంగా ఉందని, వెంటనే మార్చాలని డీటీఎఫ్ అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి డిమాండ్ చేశారు.
