అమ్రాబాద్, సెప్టెంబర్ 19 : చెంచు మహిళ మృతదేహాన్ని 108 అంబులెన్స్ సిబ్బంది అడవి మధ్యలో వదిలేసి వెళ్లిన అమానవీయ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈర్లపెంటకు చెందిన గురువమ్మ(29) పది రోజులు క్రితం అనారోగ్యానికి గురైంది. అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. వైద్యులు మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ దవాఖానలో గురువమ్మ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. మహబూబ్‌నగర్ నుంచి గురువమ్మ డెడ్‌బాడీని తీసుకొని 108 అంబులెన్స్ బయలుదేరింది. అమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తాకు రాగానే అక్కడ మృతదేహంతోపాటు, కుటుంబ సభ్యులను కిందికి దింపారు. బాధిత కుటుంబం కాళ్లా.. వేళ్లాపడినా సిబ్బంది కనికరించలేదు. చీకట్లో అడవిలో దిక్కుతోచని స్థితిలో.. డెడ్‌బాడీతో అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం స్థానికుల సాయంతో మన్ననూరుకు వెళ్లి, ఆటో మాట్లాడుకొని మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లారు. ఆదివాసీలపై వివక్ష చూపడం సరికాదని చెంచులు, చెంచు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీడీఏ అధికారులకు సమాచారం ఇచ్చే డెడ్‌బాడీని అక్కడ దించి వెళ్లామని అంబులెన్స్ సిబ్బంది చెప్తున్నట్టు సమాచారం.