హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి తాగు, సాగునీటికి డిసెంబర్ వరకు 102 టీఎంసీలు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇండెంట్‌ను సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ(జనరల్) అమ్జద్హుస్సేన్కు నల్గొండ చీఫ్ ఇంజినీర్ అజయ్‌కుమార్ లేఖ రాశారు. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెలవారీగా తాగు, సాగునీటి అవసరాల వివరాలను సమర్పించారు. ఇప్పటివరకు సాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమకాలువ, ఏఎమార్పీ కింద తెలంగాణ మొత్తంగా తాగు, సాగు అవసరాలకు 26.71టీఎంసీలను వినియోగించుకున్నది. అదేసమయంలో ఏపీ సాగర్ కుడికాలువ, ఎడమ కాలువ కలిపి మొత్తంగా 28.03టీఎంసీలను వినియోగించుకున్నది. ఇక ప్రస్తుతం సాగర్‌లో 178.59టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే డిసెంబర్ 25వరకు సాగునీటి అవసరాలకు 88.50టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 14టీఎంసీలు మొత్తంగా 102.50టీఎంసీలు అవసరమవుతాయని ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నెలవారీగా వాటర్ ఇండెంట్‌ను రూపొందించారు. ఆ వివరాలను ఈఎన్సీ జనరల్‌కు తాజాగా సమర్పించారు. వాటర్ ఇండెంట్‌ను కేఆర్ఎంబీకి పంపించాలని ఆ లేఖలో కోరారు.