Telangana | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ‘ఈ తెలంగాణకు ఏమైంది? ఒకవైపు డ్రగ్స్, మరోవైపు సారా. కొందరి పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్య ధోరణికి తప్పదు భారీ మూల్యం’ అంటూ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కమాండ్ కంట్రో ల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. సీఎం ఆందోళనకు తగ్గట్టుగానే తెలంగాణలో డ్రగ్స్, సారా కేసులు దారుణంగా పెరిగాయి. 5 నెలల రాష్ట్ర నార్కోటిక్ బ్యూరో లెక్కలే ఇందుకు నిదర్శనం. ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు నెల్లలో పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసులు 788 ఉండగా.. ఆరు నెల్లలో ఎక్సైజ్ సిబ్బంది నమోదు చేసినవి 200 వరకు ఉన్నాయి.
రూ.180 కోట్లకు డ్రగ్స్ అంచనా..
కేవలం ఐదు నెలల్లోనే రూ.75 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది చివరికి ఈ అంచనా విలువ సుమారు రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. అలాగే కేసులు కూడా సుమారు 2,000 వరకు నమోదు అవ్వొచ్చని, 3,800 మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీపీఎస్ యాక్టు ప్రకారం నమోదైన కేసుల ఆధారంగా ఇప్పటి వరకు నిందితుల నుంచి రూ.47.16 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లోని షాద్‌నగర్ పోలీసు స్టేషన్లో రూ.23 కోట్లు, గచ్చిబౌలి పీఎస్‌లో రూ.14.64 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ ఐదు నెలల్లో సుమారు రూ.102.41 కోట్ల విలువైన 42,190 కేజీల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. వీటిల్లో భారీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 26,221 కేజీల గంజాయిని ధ్వంసం చేశారు.
గుప్పుమంటున్న గుడుంబా..
బీఆర్ఎస్ హయాంలో సారా తయారీపై కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వం మారిన వెంటనే సారా మాఫియా రెచ్చిపోయింది. ఎక్కడిక్కడే మళ్లీ తయారీ మొదలుపెట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్‌శాఖ ఎక్కడికక్కడ దాడులు మొదలుపెట్టింది. ఆగస్టు నాటికి సారాను పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది విస్తృత దాడులు చేపడుతున్నది. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలల్లో 3,380 సారా తయారీదారులపై కేసు నమోదు చేసి, 16,951 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 61,739 కేజీల బెల్లం, 3,512 కేజీల పటిక, 211 వాహనాలు స్వాధీ నం చేసుకున్నారు. మొత్తం 1,159 మందిని అరెస్టు చేసి, 14,83,600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. అలాగే 579 కేజీల గంజాయి, 80 గ్రాములు హషిష్ అయిల్, 1.83 కేజీల గంజాయి చాక్లెట్లు, 1 గ్రాము ఓజీ కుష్, 12.98 కేజీల పప్పి హషీ, 0.345 గ్రాముల ఓపీఎం, 60.23 గ్రాముల ఎండీఎంఏ, 25 ఎస్ఎస్డీ బ్లాట్స్, 55.3 కేజీల అల్ఫోజోలం స్వాధీనం చేసుకున్నారు. 302 మందిపై కేసులు నమోదు చేశారు.