హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే రికార్డుస్థాయిలో అప్పులు చేసిన రేవంత్రెడ్డి సర్కారు.. మరింత రుణ సమీకరణ చేస్తున్నది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి మరో రూ.1,000 కోట్ల రు ణం తీసుకున్నది. మంగళవారం నిర్వహించిన ఈ- వేలం ద్వారా ఈ మొత్తం సేకరించినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 31 సంవత్సరాల కాలపరిమితికి 6.84శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు తీసుకున్నది. గత మంగళవారం అంటే ఈనెల 8న.. 22 ఏండ్ల కాల పరిమితికి రూ.1000 కోట్లు, 30 ఏండ్ల కాలపరిమితికి మరో రూ.1000 కో ట్లను 6.87శాతం వార్షిక వడ్డీతో రుణ సమీకరణ చేసింది.
రూ.14 వేల కోట్లకు ఇండెంట్
కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్లో రూ.4000 కోట్లు, మే, జూన్ నెలల్లో రూ.5000 కోట్ల చొప్పున రుణ సమీకరణ కోసం ఇండెంట్ పెట్టింది. ఇప్పటికే ఈ వేలం ద్వారా రూ.3 వేల కోట్లు తీసుకున్నది. ఆర్బీఐకి పెట్టిన ఇండెంట్ ప్రకారం.. ఈ నెలలో మరో 1000 కోట్లు తీసుకోనున్నది. అలాగే.. మే 6న రూ.2000 కోట్లు, 20న రూ.2000 కోట్లు, 27న రూ.1000 కోట్లు, జూన్ 3న రూ.2000 కోట్లు, 17న రూ. 2000 కోట్లు, 24న రూ.1000 కోట్లు ఈ వేలం ద్వారా రుణాలు సేకరించేందుకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ రుణాల కింద రూ.64,539 కోట్లు సమీకరిస్తామని బడ్జెట్లో ప్రతిపాదించారు.