LRS | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 3 (నమస్తే తెలంగాణ): సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం.. తన ఖజానాను నింపుకొనేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ, సీలింగ్, చెరువులు.. ఏదైతేనేం! ప్లాట్లు ఎక్కడున్నా సరే.. భూక్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)లో వాటిని క్రమబద్ధం చేసుకొనేందుకు ముందుగానే ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించాలని కోరుతున్నది. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి అది అక్రమమని తేలితే సదరు స్థలాన్ని క్రమబద్ధం చేయకుండా పది శాతం ఫీజును మినహాయించుకొని మిగిలిన 90 శాతం తిరిగి చెల్లిస్తానంటున్నది. అంటే ఖజానా నింపుకునేందుకు కనీసం కించిత్తు పరిశీలన లేకుండానే దరఖాస్తుదారుల నుంచి ఎల్ఆర్ఎస్ మొత్తాన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 28 రోజుల్లో ముగియనుండగా.. ఈలోగా జనం నుంచి అం దినంత ఖజానాలో వేసుకునేందుకు అక్రమాలకు గేట్లు తెరిచింది. రాష్ట్రంలో సీఎంగా రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. గత బడ్జెట్ లోటు 30-40 శాతం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ లోటును పూడ్చుకొనేందుకు ఎల్ఆర్ఎస్ను మాధ్యమంగా ఎంచుకున్నది.
భూమి ఏదైనా ముందైతే ఫీజు కట్టు.
ఎల్ఆర్ఎస్లో భాగంగా అనధికారిక లేఅవుట్ యజమానులు, ప్లాటుదారులు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుంటారు. దానిని మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉంటేనే ఎల్ఆర్ఎస్ కింద 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కట్టాలని నోటీసు ఇస్తారు. దరఖాస్తుదారుడు ఆ మొత్తాన్ని చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీచేస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వీటికి తిలోదకాలిచ్చింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ముందైతే 25 శాతం రిబేటును మినహాయించుకొని 14 శా తం ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించాలని ప్రభు త్వం మార్గదర్శకాలు జారీచేసింది. ఆ తర్వాత దరఖాస్తులను పరిశీలించి.. అది అక్రమమా? సక్రమమా? తేలుస్తామని అంటున్నది. లేఅవుట్ గానీ, ప్లాటుగానీ నిషేధిత జాబితాలోని భూముల్లో ఉన్నా, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్నా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించాలంటూ ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. లేఅవుట్లకు మాత్రం 26.8.2020 నాటికి పది శాతం ప్లాట్లు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ విక్రయ దస్తావేజులు ఉండాలనే షరతు మాత్రమే పెట్టింది. అంటే ఫీజు చెల్లింపునకు ముందు అధికార యంత్రాంగం ఏమాత్రం రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన చేయరని ప్రభుత్వమే అధికారిక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.
28 రోజులు.. రూ.3 వేల కోట్లు లక్ష్యం!
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎల్ఆర్ఎస్-2020 కింద రాష్ట్రవ్యాప్తంగా 25.60 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు వీటిలో సుమారు తొమ్మిది లక్షల వరకు దరఖాస్తులను పరిశీలించగా ఇంకా 16.60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. హెచ్ఎండీఏ, మున్సిపాలిటీల్లో సరైన సిబ్బంది లేక.. ప్రధానంగా సర్వేయర్లు లేక పరిశీలన ప్రక్రియ ఎప్పుడో అటకెక్కింది. ప్రభుత్వానికి అక్రమాలను కట్టడి చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ తొమ్మిది లక్షల దరఖాస్తుల నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజులను వసూలు చేయాలి. కానీ ఇలా కాకుండా అక్రమమా? సక్రమమా? అనే దానితో సంబంధం లేకుండా ముందుగా ఓపెన్ స్పేస్ చార్జీల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పైగా సాధ్యమైనంత మేరకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు టార్గెట్లు కూడా ఇచ్చారు. ఇలా ప్రభుత్వం రానున్న 28 రోజుల్లో రూ.3వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా విధించింది.
ఏండ్లలో కానిది పది రోజుల్లో తేలుస్తారా?
సరైన సిబ్బంది లేకపోవడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఏండ్లుగా నత్తనడకన సాగుతున్నది. ఈ క్రమంలో ఈ నెల 31 వరకు చకచకా ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తర్వాత పది రోజుల్లో ప్రాసెస్ (పరిశీలన, ప్రొసీడింగ్ల జారీ)ను పూర్తిచేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 16.60 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉండగా, కొత్తవాటికి అవకాశం ఇవ్వడంతో మరో ఐదు లక్షల వరకు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు తొమ్మిది లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగితే… 21-22 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యేందుకు ఎంత సమయం పడుతుంది? అవి అక్రమమా? సక్రమమా? అని తేల్చేందుకు ఇంకెంత సమయం కావాలి? అప్పటివరకు దరఖాస్తుదారులు చెల్లించిన మొత్తం సర్కారు ఖజానాలోనే ఉండి, ఒకవేళ అక్రమమని తేలితే ఆ పై 90 శాతం ప్రభుత్వం నుంచి వాపసు ఎప్పుడు వస్తుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగూ ప్రభుత్వానికి ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించినందున పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేచే అవకాశం ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే… పట్టణ ప్రణాళిక గాడి తప్పడంతోపాటు వాటిని కొనుగోలు చేసిన సామాన్యుడు ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇదే ప్రభుత్వం హైడ్రా అంటూ బుల్డోజర్లు పట్టుకొని వస్తే సామాన్యుడి గతేం కావాలనే ఆందోళన వ్యక్తమవుతుంది.
ఇది ముమ్మాటికీ సర్కారు దోపిడీనే..!
ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేసి, ఉచితంగానే క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ నమ్మించింది. కానీ ఖజానా నింపుకొనే క్రమంలో పేదలను దోచుకునే ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నది. ఎల్ఆర్ఎస్ కడితే దేవుడి హుండీలో వేసినట్టుగా మారింది. అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ఫీజులను ముందుగానే వసూలు చేయడం సరికాదు. దీంతో ఎంతోమంది ఫీజుల కోసమే లక్షల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ విధివిధానాల ప్రకారం ప్రకారం ఎల్1, ఎల్2, ఎల్3 దశలను పూర్తిచేసిన తర్వాత ఫీజులు చెల్లించాలి. కానీ ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేసుకుని 100 శాతం ఫీజులు చెల్లించిన తర్వాత క్రమబద్ధీకరణ సాధ్యసాధ్యాలను పరిశీలించి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం దారుణం. దీనికి బదులుగా క్రమబద్ధీకరణ అవుతుందని నిర్ధారణ అయిన తర్వాతే ఫీజులను వసూలు చేయాలి. అంతేగానీ ఒకసారి ఫీజులు కట్టి, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ రాకపోతే ఫీజులో 10 శాతం కోత విధించి, 90 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పడమంటే పేదలను ఫీజులతో దోచుకోవడమే అవుతుంది.
– నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్.
ఎల్ఆర్ఎస్ నిబంధనలు
అనధికారిక లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరోసారి విధివిధానాలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించింది. ఇందులో అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తూ… మొత్తం లే అవుట్లో కనీసం 10 శాతం ప్లాట్లను 26.08.2020 నాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేసుకొని ఉంటే మిగిలిన ప్లాట్లకు కొత్తగా ఎల్ఆర్ఎస్ చెల్లించుకునేందుకు అనుమతించింది.
విధివిధానాలు ఇలా ఉన్నాయి.