(స్పెషల్ టాస్క్బ్యూరో – నమస్తే తెలంగాణ) : గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల దమనకాండ వెనుక రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అక్కడ ఏకంగా రెండు కంటెయినర్లు వేయడంతో పాటు బౌన్సర్ల పహారాలో జేసీబీలతో పనులు కూడా చేస్తున్నారు. సామాన్యుడు గజం సర్కారు భూమిలో గుడిసె వేసుకుంటే బుల్డోజర్లతో హడలెత్తించే అధికారులు సద రు ప్రైవేటు వ్యక్తుల మీద ఈగ వాలనీయడం లేదు. దీనిని బట్టే తెర వెనక మంత్రాంగం భారీస్థాయిలో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆక్రమణల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆక్రమణల వెనుక రూ.100 కోట్ల డీల్ జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సర్వేనెంబరు 36, 37లోని భాగ్యనగర్ టీఎన్జీవో భూములపై డీ నర్సింగరావు, ఇతరుల పేరిట ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారనేది బహిరంగ రహస్యం.
ఇందులో భాగంగా 30 ఎకరాలపై ఒక నిర్మాణ సంస్థ కన్నేసిందని, ఓ మంత్రి ఆశీర్వాదంతో ఆ భూముల్లోకి ప్రవేశించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సర్వేనెంబరు 37లోని బసవతారకనగర్ ఉన్న ఎనిమిది ఎకరాల స్థలంతోపాటు సర్వేనెంబరు 36లోని 22 ఎకరాల వరకు భూమిని ఆ నిర్మాణ సంస్థ తీసుకోవాలని నిర్ణయంచిందని సమాచారం. ఈ మేరకు డీ నర్సింగరావు నుంచి తాము దశాబ్దాల కిందటే ప్లాట్లు కొన్నామని చెప్తున్న వినాయకనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యుల నుంచి ఆ నిర్మాణ సంస్థ గుండుగుత్తగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అనంతరం ఓ మంత్రిని ఆశ్రయించి, ఎన్వోసీలు ఇప్పించి భూమి అప్పగించేందుకు ఒప్పందం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
బసవతారకనగర్‌లోని గుడిసెల్ని ఖాళీ చేయించడం మొదలు సర్వేనెంబరు 36లో ప్రైవేటు వ్యక్తులు కంటెయినర్లు వేసి భూమిని చదును చేసే పనులు నిర్వహించడం వరకు రెవెన్యూ అధికారుల తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. గతంలో డీ నర్సింగరావు, ఇతరులు క్లెయిమ్ చేసిన భూమి సర్వే నంబరు 36, 37లోని టీఎన్జీవోల భూమి ఒకటి కాదని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూమిని రక్షించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. భూములు ఇప్పటికీ ప్రభుత్వానివిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా, ప్రైవేటు వ్యక్తులు అందులోకి ప్రవేశించి చదును చేసే పనులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. పైగా రికార్డుల్లో కనిపించని సర్వేనెంబరు, సబ్ డివిజన్స్‌ను అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొననడం విడ్డూరం. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి అన్ని రికార్డులు, ఆధారాలు ఉంటే రెవెన్యూ యంత్రాంగం బాజాప్తా వారికి ఎన్వోసీలు ఇచ్చి భూమిని అప్పగించాలి. కానీ రికార్డుల్లో వారి పేర్లు ఇప్పటికీ ఎక్కించకుండా, ఎన్వోసీలు బయటికి ఇవ్వకుండా భూములను మాత్రం ప్రైవేటు వారికి అప్పగించడంపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం-ఉద్యోగులు వీరికి కాకుండా మూడో వారికి భూమిని అప్పగించకుండా ఇప్పటికీ హైకోర్టు స్టేటస్ కో కొనసాగుతున్నది. కానీ సదరు మంత్రి అండతో అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో ప్రైవేటు నిర్మా ణ సంస్థ సర్వేనెంబరు 36లో కంటెయినర్లు వేసి యథేచ్ఛగా చదును చేసే పను లు కొనసాగిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల నిరసనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు నిలిపివేసిన సదరు సంస్థ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ ఎత్తున యంత్రాలతో పనులు కొనసాగించిందని సమాచారం. అంతేగాకుండా ఈ భూమిని అనధికారికంగా లేఅవుట్ చేసి ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి ఆధారాలు, ప్రభుత్వ రికార్డులు లేకున్నా పేపర్‌పై ప్లాట్లు చేసి నిర్మాణ సంస్థ విక్రయిస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.