సిద్దిపేట, ఏప్రిల్ 4( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారం అండతో కాంగ్రెస్ మూకలు రెచ్చిపోయారు. మొన్న సిద్దిపేటలో.. ఇప్పుడు గజ్వేల్‌లో గూండాయిజం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయ సిబ్బందిపైనా దాడికి ప్రయత్నించారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడంతో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్, కిటికీల అద్దాలను పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడిని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో గజ్వేల్ క్యాంప్ ఆఫీస్‌పై జరిగిన దాడి.. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రెండు రోజల క్రితం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించారు.
నిరుడు నర్సాపూర్ ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ ఆఫీస్‌పై కూడా కాంగ్రెస్ మూకలు దాడులు చేశారు. గ్రామాల నుంచి బూత్ కమిటీలు వేద్దాం అని పార్టీ క్యాడర్‌ను కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పోగు చేసి గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని తీసుకొని ఆమె నివాసం నుంచి పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు వద్దకు చేరుకున్నారు. కార్యాలయం మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించి రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని చాంబర్‌లోని గోడకు తగిలించారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో నానా హంగామా సృష్టించారు. ప్రధాన ద్వారం అద్దాలను ద్వంసం చేసి, కార్యాలయంలోని విండో కర్టెన్లను చింపేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపు కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై దాడికి ప్రయత్నించడంతో వారు అక్కడినుంచి పరుగులు తీశారు. మట్టి పెడ్డలను కార్యాలయంలోకి పడేశారు. కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ నాయకులు బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మూకలను అదుపు చేయలేకపోయారు. అంతా అయ్యాక పోలీసులు తీరిగ్గా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను, క్యాంప్ ఆఫీస్ సిబ్బందిని బయటకు పంపించి మెయిన్ గేట్‌కు తాళం వేశారు.
బీఆర్ఎస్ నేతల అడ్డగింత
దాడి విషయంలో తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. కానీ వారిని లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది. ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి కార్యాలయానికి చేరుకొని బీఆర్ఎస్ నేతలతో కలిసి క్యాంపు ఆఫీస్‌లో పగిలిన గ్లాసు డోర్, కిటికిలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా క్యాంపు కార్యాలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులుతో వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాన్ని పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులు తొలగించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు.
సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపు
గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ మూకలు చేసిన దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ పట్టణ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఆ దుండగులను అరెస్ట్ చేయాలి: పల్లా
గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కార్యాలయంపై జరిగిన దాడిని శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ ఆస్తి అని, వాటిపై దాడి చేయడమంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. హామీలు నెరవేర్చే దమ్ములేక, చేతగాని కాంగ్రెస్ సర్కార్ ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమని పేర్కొన్నారు.
దాదాగిరీ చెల్లదు

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిలో పగిలిన కిటికీ అద్దాలు, క్యాంపు కార్యాలయంలో
రేవంత్‌రెడ్డి ఫొటోను తొలగిస్తున్న బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు