హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్‌రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ‘ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పాలి గాని, ఇలా నేనే ఇస్తా అనడం అంటే ప్రభుత్వం ఏమైనా రేవంత్‌రెడ్డి జాగీరా? రాష్ట్రంలో భూసేకరణ చట్టం లేదా?’ ధ్వజమెత్తారు. నిర్వాసితులకు నష్టపరిహారం పెంచే ప్రణాళిక ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పాలని, పరిహారం పెంపు కేవలం కొడంగల్కేనా? రాష్ట్రమంతా అమలుచేస్తారా? అనేది కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చేతకానితనం వల్ల వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, ఇప్పుడు శ్రీశైలంలో 130 టీఎంసీలే ఉన్నాయని చెప్పారు. ఎండకాలంలో రైతులు వరి వేయాలా? వద్దా? నీళ్లు ఇస్తారా? ఇవ్వరా? అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం టీఎస్టీఎఎస్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరులో రైతు పండుగ పేరుతో రేవంత్ సర్కారు నిర్వహించిన సభ కాంగ్రెస్ సభగా మారిందని మండిపడ్డారు.
పాలమూరు సభలో సీఎం తమకు ఏదైనా లబ్ధికలిగే విషయాలు చెప్తారేమోనని ఎదురుచూసిన ప్రజలు, రైతులకు ఒరిగిందేమిటి? లగచర్లలోని గిరిజన భూములే కావాల్నా? మిగతా చోట్ల వద్దా? ప్రభుత్వం ఎందుకు మంకుపట్టు పడుతున్నది? ఫార్మా కాకుంటే ఇంకో విధంగా తప్పకుండా భూములు లాకుంటామని గిరిజనుల మీద పడటం ఏమిటి? పాలమూరును ఉద్ధరించినట్టు మీ బిల్డప్పేమిటి?
ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణం ఎవరు? అని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ‘సాయిరెడ్డి మరణం సందర్భంగా ఆంక్షలు విధించింది ఎవరు? కనీసం పరామర్శకు కూడా వెళ్లనివ్వలేదు.. ప్రజలు ఈ దారుణాలను మరిచిపోలేదు’ అని మండిపడ్డారు. వలసలను ఆపి పాలమూరును బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చగా చేసిందని, రేవంత్‌రెడ్డి చదువుకున్నప్పుడు వలసల దుస్థితిని ఎదుర్కొన్నది కాంగ్రెస్ పాలనలోనే కదా? అని ప్రశ్నించారు. తన తండ్రి మరణిస్తే స్నానాలు చేయడానికి నీళ్లు లేవని చెప్పింది రేవంత్‌రెడ్డే కదా? అని నిలదీశారు. ‘పులులు చూశా, నకలు చూశా అని రేవంత్‌రెడ్డి హూంకరిస్తున్నారు.. మీ వీరత్వం, ధీరత్వం పనుల్లో చూపించాలి’ అని చురకలంటించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులు, చెరువులు నింపడం చేతగాక వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కృష్ణానది నుంచి శ్రీశైలం ద్వా రా తెలుగుగంగ, పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలతో దాదాపు 400 టీఎంసీల నీటిని తీసుకువెళ్లిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దఎత్తున నీళ్లు వచ్చినా ఈ యాసంగికి సాగు నీరు అందే పరిస్థితి లేదని, శ్రీశైలంలో ప్రస్తుతం 130 టీఎంసీలే ఉన్నాయని మరి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద సాగు పరిస్థితి ఏమిటని, రైతు సంబురాలు చేసిన సీఎం యాసంగి పంటలు వేయాలా? వద్దా? రైతులకు ఎందుకు చెప్పి రాలేదు? అని నిలదీశారు. రాష్ట్రంలో 568 మంది రైతులు మరణించారని, వారి మరణాలకు కారకులెవరని నిలదీశారు.
ప్రభుత్వం ఏదో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నట్టు మాట్లాడుతున్నరు. అడ్డుపడితే తొకుకుంట పోతా అంటున్నరు. నిధులివ్వబోమంటే మంత్రులను తొకుకుంట పోతరా? భూములివ్వని రైతులను తొకుకుంట పోతరా? హామీలు అమలుచేయాలని అడిగితే ప్రజలను తొకుకుంట పోతరా? ఈ బెదిరింపు భాషేంది రేవంత్‌రెడ్డీ?
వడ్లకు బోనస్ విషయంలో రేవంత్ సర్కారు రైతులను మోసం చేస్తున్నదని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ‘అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 40.55 లక్షల ఎకరాల్లో అంటే (61శాతం) సన్నవడ్లు, మరో 4.5 లక్షల ఎకరాల్లో విత్తన వెరైటీలు సాగు చేశారు. మిగిలిన 36 లక్షల ఎకరాల్లో పండిన సన్నాలు మారెట్‌కు వస్తాయి అనుకున్నా ఎకరాకు సగటున 22 క్వింటాళ్లు. ఈ లెకన 80 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి రావాలి. రైతులు తిండి అవసరాలకు 10 లక్షల మెట్రిక్ టన్నులు ఇంట్లో పెట్టుకున్నా 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రావాలి. ఈ లెకన 7 కోట్ల క్వింటాళ్లకు ప్రభుత్వం రూ.500 చొప్పున బోనస్ ఇచ్చినా రూ.35 వేల కోట్లు అవుతుంది. కేసీఆర్ ఇచ్చిన ఎకరాకు రూ.10 వేల రైతుబంధు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం రూ.35 వేల కోట్ల బోనస్ ఎలా ఇస్తుంది?’ అని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ఇప్పటివరకు రూ.20 కోట్లు బోనస్‌గా ఇచ్చినట్టు చెప్తూ తడిగుడ్డతో రైతుల గొంతు కోస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే మూడు ఎన్కౌంటర్లు అయ్యాయి. ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ఆకునూరి మురళి ఎకడికి పోయారు? పదేండ్ల కేసీఆర్ పాలనలో లేని ఎన్కౌంటర్లు రాష్ట్రంలో మళ్లీ పునరుద్ధరించబడ్డాయా? ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందన్న అపోహలు, భ్రమలను రైతులు, ప్రజలు పెట్టుకోవద్దు. అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి’ అని విజ్ఞప్తిచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిరసనలు, ఆందోళనలు తెలియజేస్తున్నదని చెప్పారు.
పారిశ్రామిక క్లస్టర్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పెట్టింది. ఇప్పటికే అకడ పలు మిల్లుల ఏర్పాటు కోసం కొందరు టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకున్నరు. రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అకడ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.