హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని, దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నాయని, ఇందులో ఎలాంటి సందేహాలు, వివాదాలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. శ్రీధర్‌బాబు శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ బాండ్ల ద్వారా రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వానికి రుణం ఇచ్చింది ఐసీఐసీఐ కాదని చెప్పారు. మర్చంట్ బ్యాంక్(బ్రోకర్) ద్వారా టీజీఐఐసీ బాండ్లతో నిధులను సమీకరించినట్టు తెలిపారు. ఈ భూములకు సంబంధించిన బాండ్లను వేలం వేయడం ద్వారా రూ.8,476 కోట్లు ఖజానాకు చేరాయని, మిగిలిన మొత్తం త్వరలోనే వస్తుందని తెలిపారు. ఇందుకోసం కంపెనీలు, టీజీఐఐసీకి మధ్యవర్తిత్వం వహించినందుకుగాను బీకాన్ ట్రస్టీ అనే సంస్థకు ఫీజు చెల్లించినట్టు వెల్లడించారు.
కంచ గచ్చిబౌలి భూములపై ఏఐ ద్వారా సృష్టించిన గ్రాఫిక్స్ ఫొటోలతో అసత్య ప్రచారం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని తెలిపారు. అయితే ఆ భూములపై వివరణ ఇచ్చేందుకు సుమారు గంటన్నరపాటు మీడియాతో మాట్లాడిన మంత్రి.. అసలు ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఆ భూముల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎకరం భూమి విలువ రూ.75 కోట్లను రూ. 52 కోట్లకు ఎందుకు తగ్గించారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఈ భూముల ద్వారా సేకరించిన నిధుల్లో రైతుభరోసా కోసం రూ.5,463 కోట్లు, రుణమాఫీ కోసం రూ.2,146 కోట్లు, సన్నధాన్యం బోనస్ కోసం రూ.947 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు.
కానీ ఆ నిధులతో రైతుభరోసా పూర్తిచేస్తామని అనుకూల పత్రికలకు లీకులిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ నిధులను ఇతర పథకాలకు కూడా ఎందుకు ఖర్చు చేసిందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. నమస్తే తెలంగాణ కూడా శుక్రవారం ప్రచురించిన కథనంలో కంచ గచ్చిబౌలి నిధులు రైతుభరోసాకు కాకుండా దారిమళ్లాయనే అంశాన్ని ఎత్తి చూపింది. శ్రీధర్‌బాబు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. నవంబర్ 30 నాటికే రుణమాఫీ పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం డిసెంబర్ చివర్లో వచ్చిన కంచ గచ్చిబౌలి భూమి నిధులను రుణమాఫీకి ఏ విధంగా ఖర్చు చేసిందో చెప్పలేదు.
సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటరు.. ఉండి తీరుతరని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఎలాంటి అవినీతి లేకుండా, మంచి సంక్షేమ పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే సీఎంను మార్చబోతున్నదని, శ్రీధర్‌బాబును సీఎం చేయనున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా మంత్రి పైవిధంగా స్పందించారు.